రైల్వేస్టేషన్లో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరికివేత!

రైల్వేస్టేషన్లో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరికివేత! - Sakshi


రోజూలాగే ఉద్యోగానికి బయల్దేరి వెళ్దామని లోకల్ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చెన్నై నుంగంబాకం రైల్వేస్టేషన్లో దారుణంగా నరికి చంపేశారు. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే 24 ఏళ్ల స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది. ఆమె తండ్రి శ్రీనివాసన్ ఆమెను కొద్ది నిమిషాల ముందే రైల్వేస్టేషన్ వద్దకు తీసుకెళ్లి దించారు. ఆయన కేంద్రప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. ప్లాట్ఫాం మీద రైలు కోసం స్వాతి వేచిచూస్తుండగా.. నల్ల ప్యాంటు వేసుకున్న ఓ యువకుడు ఆమెకు సమీపంగా వచ్చి, ఓ కత్తితో ఆమెను నరికేశాడు. ముందుగా ఇద్దరికీ మధ్య కాస్త వివాదం జరిగిందని, తర్వాత కొద్దిసేపటికి అతడు తన ట్రావెల్ బ్యాగ్ లోంచి పొడవాటి కత్తి బయటకు తీసి దాంతో ఆమెను నరికేశాడని అదే సమయంలో స్టేషన్లో ఉన్నవాళ్లు చెప్పారు.


గత వారం ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్తో గొడవ అవ్వడంతో, అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ‍స్వాతి ముఖం మీద, మెడ మీద బాగా నరికిన గాయాలయ్యాయి. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. స్వాతికి బాగా తెలిసినవాళ్లే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని మద్రాస్ మెడికల్ కాలేజీకి పంపారు. ఈ విషయం తెలిసి చాలామంది బంధువులు ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగిస్తారు.



స్వాతి మరణంపై ఇన్ఫోసిస్ స్పందించింది. ‘‘చెన్నైలో మా ఉద్యోగిని దుర్మరణానికి కారణమైన ఈ దురదృష్టకర ఘటన పట్ల మేం చాలా విచారిస్తున్నాం. ఈ కేసును విచారిస్తున్న స్థానిక అధికారులకు మావైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ బాధామయ క్షణాలలో ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అన్నిరకాలుగా సాయం అందిస్తాం’’ అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top