అది.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టు!

అది.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టు!


దేశ రాజధానిలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఏడాదికి 2.5-4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిన విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఎయిర్పోర్టు సేవల నాణ్యత అవార్డును ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల జోర్డాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందించింది. ఎయిర్పోర్టు భాగస్వాములు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించి వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం అందించేందుకు కృషిచేశారని, అందుకే తమకు ఈ స్థానం దక్కిందని ఢిల్లీ ఎయిర్పోర్టు సీఈవో ఐ. ప్రభాకర రావు చెప్పారు.



వినియోగదారులకు సేవల విషయంలో 300 మంది సభ్యుల బృందం 5 పాయింట్లను చూడగా, అందులో ఢిల్లీకి 4.90 స్కోరు వచ్చింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. తర్వాతి సంవత్సరానికి తన పనితీరు మెరుగుపరుచుకుంది. ఇక్కడినుంచి గడిచిన సంవత్సరంలో దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులు 58 స్వదేశీ, 62 అంతర్జాతీయ గమ్యాలకు వెళ్లారు. సగటున రోజుకు 885 విమానాలు వెళ్లాయి, వాటిలో 6.96 లక్షల టన్నుల కార్గోను తీసుకెళ్లారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top