ఆరేళ్లుగా బిడ్డలు దూరమైన ఓ తల్లి దీనగాధ

ఆరేళ్లుగా బిడ్డలు దూరమైన ఓ తల్లి దీనగాధ


వాషింగ్టన్: ఆరేళ్ల క్రితం తన నుంచి దూరమైన ఇద్దరు కవల పిల్లల కోసం ఆ తల్లి హృదయం అణుక్షణం తల్లడిల్లి పోతోంది. వారి సంరక్షణ బాధ్యతలకు తనకే అప్పగించాలని కోరుతూ అటు భారత్‌లో, ఇటు అమెరికా కోర్టుల్లో ఆరే ళ్లుగా న్యాయ పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు అమెరికా పార్లమెంట్‌నే ఆశ్రయించింది. ఇన్నేళ్లుగా  కనీసం క్షణంపాటు పిల్లలను చూసే భాగ్యానికి కూడా నోచుకోని ఆ తల్లి మనో వేదనను ఎలా వర్ణించగలం? ఆమెను ఇంత క్షోభకు గురి చేస్తుంది మరెవరో కాదు. తనను అన్యాయం చేసి తన నుంచి విడిపోయిన మాజీ భర్త సునీల్ జాకబ్.



కన్న పిల్లలకు దూరమై చట్టాల చిక్కుముళ్లలో నలిగిపోతున్న ఆ మాతృ మూర్తి పేరు బిందు ఫిలిప్స్. ఇండో అమెరికనైనా బిందుకు అల్బర్ట్ ఫిలిప్ జాకబ్, ఆల్‌ఫ్రెడ్ ఫిలిప్ జాకబ్ అనే ఇద్దరు కవల పిల్లలు. వారిద్దరికి ప్రస్తుతం 14 ఏళ్లు ఉన్నాయి. 2008, డిసెంబర్‌లో తండ్రి సునీల్ జాకబ్, భార్య, పిల్లలతో కలిసి వెకేషన్‌కు భారత్‌కు వెళ్లారు. అక్కడ భార్య బిందును తీవ్రంగా హింసించిన సునీల్, ఆమె నుంచి పిల్లల్ని బలవంతంగా లాక్కుపోయి ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్చారు. పిల్లలను చూడకుండా బిందును కట్టడి చేయడమే కాకుండా ఆమెను పిల్లలను చూసేందుకు అనుమతించరాదంటూ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మేనేజ్ చేశారు. అత్తమామలు కూడా ఆమెను వేధించడంతో భరించలేక అమెరికన్ సిటిజనైన  బిందు 2009, ఏప్రిల్‌లో అమెరికాకు తిరిగొచ్చారు.



న్యూజెర్సీలోని అత్యున్నత ఫ్యామిలీ కోర్టులో తన భర్త తన పిల్లల్ని నిర్బంధించి, తనకు దూరం చేశారని కేసు వేశారు. పిల్లలను అమెరికాకు రప్పించి బిందు రక్షణకు అప్పగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆధేశిస్తూ 2009, డిసెంబర్‌లో కోర్టు తీర్పు చెప్పింది. ఈలోగా భర్త సునీల్ కూడా భారత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పిల్లలను అమెరికాకు తీసుకరావడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం వారి కేసు గత ఆరేళ్లుగా భారత్ సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఇలాంటి కేసుల్లో అమెరికా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని పరిష్కారం కనుక్కుంటేగానీ బాధితులకు న్యాయం జరగదు.



అమెరికా పార్లమెంట్ విదేశీ వ్యవహారాలకు చెందిన  ఓ సబ్ కమిటీ ముందు ఇటీవల బిందుతోపాటు 25 మంది అలాంటి తల్లిదండ్రుల వాదనలను ఆలకించారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఉపయోగించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కమిటీ బాధితులకు హామీ ఇచ్చింది. అమెరికా పౌరులైన పిల్లలను విదేశాల్లో నిర్బంధించే ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా అంతర్జాతీయ ఒప్పందాల్లో సవరణలు అవసరమని కూడా అమెరికా పార్లమెంట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top