నయీం కేసులో తొలి పొలిటికల్‌ వికెట్‌!

నయీం కేసులో తొలి పొలిటికల్‌ వికెట్‌! - Sakshi


హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నది. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో అంటకాగి.. అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి పొలిటికల్‌ వికెట్‌ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వనీసయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను పదవీ నుంచి తప్పించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన వర్గం నిర్ణయించింది.



దీపావళి పండుగ ముగిసిన వెంటనే నేతి విద్యాసాగర్‌రావు స్వచ్ఛందంగా మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి నుంచి దిగిపోనున్నారని సమాచారం. నవంబర్‌ 2న ఆయన రాజీనామా చేస్తారని, అనంతరం నవంబర్‌ 5న ఆయన స్థానంలో మరో​ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్‌గా పగ్గాలు చేపడుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.



మరింతమంది నాయకులపైనా వేటు!

అండర్‌ వరల్డ్‌ నేరసామ్రాజ్యాన్ని స్థాపించి సామాన్యులను గడగడలాడించిన నయీంతో అనేకమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అంటకాగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయీంతో సంబంధాలున్న పలువురు నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నయీం కేసు విచారిస్తున్న సిట్‌ కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నేతి విద్యాసాగర్‌ రావును పేరును ప్రస్తావించింది. ఆయనకు నయీంతో సంబంధాలు ఉన్నాయని పలువురు బాధితులు సిట్‌ ముందు వెల్లడించారు. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్‌మెంట్లు చేసినట్టు వెల్లడించారని సమాచారం. నేతి విద్యాసాగర్‌రావుపై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు పలువురిపైనా చర్యలు తప్పవని వినిపిస్తోంది. దీంతో నయీంతో సంబంధం ఉన్న టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నేతల్లోనూ గుబులు మొదలైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top