హోదాతోనే అభివృద్ధి..


తమ ప్రసంగాల్లో నొక్కిచెప్పిన నేతలు

 

గుంటూరు: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని పలువురు నేతలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై గురువారం పలువురు నేతలు మాట్లాడారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కచ్చితంగా సంజీవనేనని.. పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ప్రత్యేక హోదా రాదనే ఆందోళనలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమర వీరుల ప్రాణ త్యాగాలు వృథా కాకూడదని లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు లోక్‌సత్తా పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.  కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజాకోర్టులో మొదటి ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే నాయకుడి మీద మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారని.. జగన్ చేస్తున్న దీక్ష దగ్గరకు వచ్చి దీక్ష నాటకమని మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.



రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కోసం జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదుకదా, వాళ్ల బాబు తరం కూడా కాదని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ‘ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష తప్పని నిరూపించే ధైర్యం మీకుందా? పబ్లిక్‌గా చర్చకు వస్తారా? ఇది నా సవాల్’ అని అన్నారు. జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌కు జాబ్ లేదని, అయినా ఆయన ఏడాదిన్నర కాలంలోనే రూ. 2.5 లక్షల కోట్లు దోచుకున్నారని పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు.  రాష్ట్ర రాజధాని శంకుస్థాపన నిర్వహించేందుకు  22న జిల్లాకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటన చేయించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.   తెలుగుజాతి భవిష్యత్తు కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష చరిత్రలో మిగిలిపోతుందని నటుడు విజయచందర్ చెప్పారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top