ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

I'm glad I'm doing well in batting and bowling, says Hardik Pandya - Sakshi

సాక్షి, చెన్నై: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హార్థిక్‌ పాండ్యా దుమ్మురేపాడు. మొదట బ్యాటింగ్‌లో 66 బంతుల్లో 83 పరుగులు చేసిన పాండ్యా.. తర్వాత బౌలింగ్‌లో కీలకమైన స్టీవ్‌ స్మీత్‌, ట్రావిస్‌ హేడ్‌ వికెట్లు పడగొట్టాడు. భారత్‌ అలవోకగా విజయం సాధించిన ఈ వన్డేలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సొంతం చేసుకున్న పాండ్యా మాట్లాడుతూ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ తాను రాణించి ఉంటే.. తన ఆటతీరు పరిపూర్ణమయ్యేదని జోక్‌ చేశాడు. 'నాకు ఇది చాలామంచిరోజు. కొన్ని క్యాచ్‌లు కూడా పట్టి ఉంటే బాగుండేది. మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది' అని పోస్ట్‌ మ్యాచ్ ప్రజెంటేషన్‌ అనంతంర పాండ్యా అన్నాడు.

గడిచిన కొన్నాళ్లలో తానేమీ పెద్దగా మారలేదని, కానీ, ప్రజలే తనను భిన్నంగా చూస్తుండొచ్చునని పాండ్యా అభిప్రాయపడ్డాడు. 'పెద్దగా మారిందేమీ లేదని నేను అనుకుంటున్నా. నేను పాత హార్థిక్‌నే. కానీ గత ఏడాది కన్నా కొంచెం శాంతంగా మారిపోయి ఉంటాను. కానీ, ప్రజలే నా గురించి భిన్నంగా అనుకుంటున్నారేమో.. నేను మాత్రం నా ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా' అని పాండ్యా చెప్పాడు.

స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్‌కు వస్తాడు కాబట్టి.. అతన్ని టార్గెట్‌ చేయాలని తాను, ధోనీ ముందే అనుకున్నట్టు పాండ్యా తెలిపాడు. ఆడం జంపా బౌలింగ్‌లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి అలరించిన సంగతి తెలిసిందే. 'జంపా బౌలింగ్‌కు వస్తున్నాడని నాకు తెలుసు. అతని ఓవర్‌లో పరుగులు పిండుకోవాలని మేం ప్లాన్‌ చేసుకున్నాం. అది వర్కౌట్‌ కావడం హెల్ప్‌ అయింది' అని పాండ్యా చెప్పాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణించడం ఆనందంగా ఉందని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి విజయంతో భారత్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్‌ 26 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం) ఆసీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎమ్మెస్‌ ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఎట్టకేలకు వాన ఆగిన తర్వాత ఆసీస్‌ విజయ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. ఆ జట్టు చివరకు 21 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరుగుతుంది.  
 

  • ఆడం జంపా బౌలింగ్‌లో ఉతికి ఆరేసిన పాండ్యా
  • మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో జంపాకు చుక్కలు
  • ప్లాన్‌ ప్రకారమే బ్యాటింగ్‌ చేసినట్టు వెల్లడి
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top