ఈ ఎంపీ గారి డిమాండ్ విన్నారంటే..!

భార్య అనామికాతో బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే - Sakshi


న్యూఢిల్లీ: 'ఫలానా నియోజకవర్గంలో నాకు పరపతి ఉంది. ఈజీగా గెలిచేస్తా. ఆ టికెటే ఇవ్వండి..' తరహా వేడుకోళ్లు, డిమాండ్లు ఎన్నికల సమయంలో విటూఉంటాం. అయితే ఈ ఎంపీ గారి డిమాండ్ వాటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఆయన పోటీచేయాలని కోరుకుంటున్నది అలాంటిలాంటి చోటు నుంచి కాదు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి!



బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను పీఓకే నుంచి లోక్ సభకు పోటీచేస్తానని అన్నారు. ఆమేరకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని మోదీ సర్కారును డిమాండ్ చేశారు. ప్రస్తుతం గొడ్డా (జార్ఖండ్) స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఎంపీగారు.. పీఓకేలో పోటీ మాటెత్తడం ఇది మొదటిసారేమీకాదు. నిజం చెప్పాలంటే ఇందుకోసం ఆయన సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు కూడా!



జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అయితే ప్రాతినిథ్యం లేకపోవడంతో దశాబ్దాల నుంచి ఆ సీట్లన్నీ ఏళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. ఇక నిశికాంత్ దుబే మతలబు ఏంటంటే.. పీఓకేకు కశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ఉండగా, లోక్ సభ స్థానం ఉంటే తప్పేమిటీ? అని! ఈ మేరకు చట్టం రూపొందించాలనే డిమాండ్ తో ఆయన లోక్ సభలో 2014, 2015 సంవత్సరాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా పెట్టారు. అఫ్ కోర్స్ ఆ బిల్లు చర్చకు రాలేదనుకోండి!



ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పీఓకే, గిల్గిట్, బలూచిస్థాన్ లపై సంచలన ప్రకటన చేయడం, పీఓకే భారత్ లో అంతర్భాగమంటూ స్పష్టం చేయడంతో ఎంపీ నిశికాంత్ దుబే మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వారం బీజేపీకే చెందిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా పీఓకేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో తిరంగా యాత్ర ప్రారంభించిన జితేంద్ర.. 'పీఓకే రాజధాని ముజఫరాబాద్ లో త్రివర్ణ పతాకం ఎగరేశాకగానీ ఈ యాత్ర పూర్తయినట్లు కాదు' అని అన్నారు.


 


అన్నట్లు.. నిశికాంత్ దుబే, ఆయన భార్య అనామికా గౌతంలపై 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదయింది. ఎన్నికల ప్రచారం కోసమని వాళ్లిద్దరూ కలిసి ఓ వ్యాపారిని రూ.2 కోట్లు లంచం అడిగినట్లు తుగ్లక్ రోడ్డు(ఢిల్లీ) పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అప్పుడు తొలిసారిగా పాపులర్ అయిన దుబే.. తర్వాతి కాలంలో భిన్నతరహా డిమాండ్లతో వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top