‘14 మంది ఎంపీలే ఉన్నారు.. రేసులో లేను’

‘14 మంది ఎంపీలే ఉన్నారు.. రేసులో లేను’ - Sakshi


షోలాపూర్‌: రాష్ట్రపతి పదవిని చేపట్టాలని తాను కలలు కనడం లేదని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. పార్లమెంట్‌ లో తమ పార్టీకి 14 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చని అభిప్రాయపడ్డారు.



పవార్‌ రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం వివిధ రాజకీయ పార్టీల కమిటీ తరఫున మహారాష్ట్రలోని షోలాపూర్‌లో  ఆయనకు పౌర సన్మానం జరిగింది. షోలాపూర్‌ ప్రభుత్వ అతిథి గృహంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కొద్ది సేపు ముచ్చటించారు. ‘ఐదు దశాబద్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. కేవలం 14 మంది ఎంపీలు కలిగిన నాయకుడు రాష్ట్రపతి కాలేడని నాకు తెలుసున’ని పవార్‌ వ్యాఖ్యానించారు.



రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సరిపడా మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పార్టీలతో మాట్లాడి ఏకాభిప్రాయానికి వస్తే ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశముందని పేర్కొన్నారు. కాగా, శరద్ పవార్‌ ను  రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తామని శివసేన ప్రకటించింది. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని అంతకుముందు శివసేన సూచించింది. పోటీకి భగవత్‌ విముఖత చూపడంతో పవార్‌ పేరును తెరపైకి తెచ్చింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top