వలస బతుకులు బుగ్గిపాలు

వలస బతుకులు బుగ్గిపాలు - Sakshi


నగరంలోని ఎయిర్‌ కూలర్ల యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం

- ఆరుగురు కార్మికుల సజీవదహనం

- మృతుల్లో నలుగురు జార్ఖండ్‌వాసులు

- రోజూలాగే గోదాం షట్టర్‌కు తాళం వేసి వెళ్లిన యజమాని

- మంటలు చెలరేగడంతో బయటపడేందుకు కార్మికుల ప్రయత్నం... కాపాడాలంటూ యజమానికి ఫోన్‌కాల్‌

- కాపాడేందుకు యత్నించిన పెట్రోలింగ్‌ పోలీసులు

- టిప్పర్‌ వాహనంతో షట్టర్‌ను ఢీకొట్టించిన వైనం

- లోపలకు వెళ్లి చూడగా మృతదేహాలుగా మారిన కార్మికులు




సాక్షి, హైదరాబాద్‌/అత్తాపూర్‌:
పొట్టకూటి కోసం నగరానికి వలసవచ్చిన ఆరుగురు కార్మికుల బతుకులు తెల్లవారుతుండగానే తెల్లారిపోయాయి. రాజేంద్రనగర్‌లో చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఎయిర్‌కూలర్ల తయారీ యూనిట్‌లో బుధవారం తెల్లవారుజామున 5.00 గం. సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురిని ఓం ఎవోన్‌ ఎయిర్‌ కూలర్స్‌లో పనిచేస్తున్న ఇర్ఫాన్‌(19), షహద్‌ (20), ముజాయిద్‌ (19), సద్దాం (20)లుగా గుర్తించారు. వారంతా జార్ఖండ్‌ రాష్ట్రంలోని చైన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నెవ్రా గ్రామస్తులని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా ఎయిర్‌ కూలర్‌ యూనిట్‌ నిర్వహిస్తున్న కార్వాన్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌పై ఐపీసీ 304 (బీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.



తెల్లవారుతుండగానే మంటలు...

అత్తాపూర్‌లోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 159 వద్ద ప్రమోద్‌ కుమార్‌ తనకున్న 300 గజాల స్థలంలో రెండేళ్ల క్రితం అక్రమంగా గోదాం నిర్మించి ట్రైవీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఓం ఎవోన్‌ ఎయిర్‌ కూలర్స్‌ యూనిట్‌ నిర్వహిస్తున్నాడు. ప్రమోద్‌కు సుపరిచితుడైన ఇర్ఫాన్‌ తన దగ్గర పనిచేసేందుకు కార్మికులు కావాలని చెప్పడంతో తన స్నేహితులైన షహద్, ముజాయిద్, సద్దాంలను జనవరిలో పనికి కుదిర్చాడు. అయితే వేసవి రావడంతో ఎయిర్‌ కూలర్లకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని ప్రమోద్‌... ఎండిన గడ్డి, ప్లాస్టిక్‌తో తయారు చేసిన వందలాది కూలర్‌ ఫ్రేమ్‌లను తెప్పించాడు. దీనికితోడు ఆ యూనిట్‌లోనే కొన్ని ఈ–రిక్షాలూ ఉన్నాయి. రోజులాగే యజమాని ప్రమోద్‌ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో యూనిట్‌ షెట్టర్‌కు బయట తాళం వేసి వెళ్లాడు. ఇర్ఫాన్, షహద్, ముజాయిద్, సద్దాంలతోపాటు రాత్రి పడుకునేందుకు వచ్చిన వారి ఇద్దరు స్నేహితులు అందులోనే ఉన్నారు. వీరంతా గాఢనిద్రలో ఉండగా తెల్లవారుజామున 5.00 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే యజమానికి ఫోన్‌ చేసి తమను రక్షించాలని అక్రందనలు చేశారు.



టిప్పర్‌తో 15 సార్లు ఢీకొట్టినా...

అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన రాజేంద్రనగర్‌ పోలీసులు మంటలను చూసి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆపై అటుగా వెళ్తున్న టిప్పర్‌ను ఆపి షట్టర్‌ను 10 నుంచి 15 సార్లు ఢీకొట్టించారు. చివరకు షటర్‌ ధ్వంసమైనా అప్పటికే వ్యాపించిన మంటల్లో గ్యాస్‌ సిలిండర్‌ కూడా పేలడంతో 10 నిమిషాల్లోనే మంటల తీవ్రత పెరిగింది. హుటాహుటిన చేరుకున్న ఆరు ఫైరింజన్లు మంటలను ఆదుపులోకి తెచ్చాయి. అనంతరం లోపలకు వెళ్లి చూడగా ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోకపోవడంతోపాటు అగ్నిమాపక భద్రత పరికరాలు అమర్చకపోవడం, గోదాంలోంచి బయటపడేందుకు మరో దారి లేకపోవడం వల్లే ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, షట్టర్‌కు తాను బయటి నుంచి తాళం వేయలేదని... కార్మికులే లోపల నుంచి తాళం వేసుకున్నట్లు యూనిట్‌ యజమాని ప్రమోద్‌ విచారణలో తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవార్త తెలియగానే సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా, శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు.



మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: నాయిని

ఘటనాస్థలిని పరిశీలించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి...మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ తరపున రూ.5 లక్షలు, ఆపద్బంధు కింద రూ. 50 వేలు, తక్షణ సాయం కింద రూ. 25 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా యజమాని ప్రమోద్‌ తరఫు నుంచి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా అంగీకారం కుదిరిందని హోంమంత్రి తెలిపారు. మృతుల బంధువులకు విమాన టికెట్లు అందించి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం సౌలభ్యం కల్పించిందన్నారు. దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు ఉంటాయని, ఎంతటి వారినైనా వదలబోమన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ కూడా ఘటనాస్థలిని పరిశీలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top