'అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాదు'

'అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాదు' - Sakshi


న్యూఢిల్లీ: అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్త మరో మహిళతో సాగిస్తున్న వివాహేతర సంబంధం అతడి భార్యను ఆత్మహత్యకు పురికొల్పుతుందన్న వాదనతో ధర్మాసనం విభేదించింది. గుజరాత్ కు చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.



ఈ కేసులో భార్యాభర్తలు విడాకులకు దరఖాస్తు చేశారు. తర్వాత భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తన భర్త మరో మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. దీంతో ట్రయల్ కోర్టు, హైకోర్టు నిందితుడిని దోషిగా తేల్చాయి.



అప్పీలెంట్ లాయర్ హెచ్ ఏ  రాయచురా వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎస్ జే ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వరకట్న వేధింపులు లేవని, నిందితుడికి అక్రమ సంబంధమున్నట్టు సరైన ఆధారాలు చూపలేకపోయారని బెంచ్ పేర్కొంది. ఇలాంటి సందర్భం సెక్షన్ 498(ఎ) కింద క్రూరత్వం కిందకు వస్తుందా అని బెంచ్ ప్రశ్నించింది. వివాహేతర సంబంధం చట్టవ్యతిరేకం, అనైతికమైనప్పటికీ అన్ని సందర్భాల్లోక్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ కేసులో మృతురాలు ఆత్మహత్యకు భర్త వివాహేతర సంబంధమే కారణమని నిరూపించాల్సివుందని పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top