ఆ 96 కోట్లమంది మాటేమిటి..?

ఆ 96 కోట్లమంది మాటేమిటి..? - Sakshi


న్యూఢిల్లీ: నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత క్యాష్‌ లెస్‌ లావాదేవీలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కాగా దీనిపై రాజకీయ పార్టీలు, మేధావులు, ఆర్థిక నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత దృష్ట్యా పూర్తిగా నగదు రహిత సమాజంగా మార్చడం సాధ్యంకాదని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇది సాధ్యం కావడం లేదని అభిప్రాయపడ్డారు.



సాంకేతిక రంగం శరవేగంగా అభివృద్ది చెందాక మన దేశంలో మొబైల్‌ వినియోగదారుల సంఖ్య పెరిగింది. గత అక్టోబరు 6న ప్రపంచ బ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం దేశ జనభా 133 కోట్లు ఉండగా.. సెప్టెంబరులో ట్రాయ్‌ పేర్కొన్న నివేదిక ప్రకారం దేశంలో మొబైల్‌ వాడకందారుల సంఖ్య 105 కోట్లు ఉంది. కాగా మన దేశంలో దాదాపు 96 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వాడటం లేదు. 37 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది. అందులోనూ వీరిలో చాలామందికి మల్టీపుల్‌ కనెక్షన్లు ఉన్నందున నెటిజన్ల వాస్తవ సంఖ్య మరింత తక్కువగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఇండియా కావడం అన్నది ప్రశ్నగా మారింది.



కాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన డిజిటల్‌ మేళా కార్యక్రమంలో బీమ్‌ యాప్‌ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మొబైల్‌, ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే ఈ యాప్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్‌ లావాదేవీలకు ఇంటర్నెట్‌ సదుపాయం అవసరం ఉండదని, వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top