నిర్దేశిత దాడి: సంచలన నిజాలు

నిర్దేశిత దాడి: సంచలన నిజాలు


పాక్ పెంచి పోషిస్తూ వస్తున్న ఉగ్రవాదుల దాడులతో ఏళ్లుగా దెబ్బలు తిని, గాయాలకు ఓర్చుకున్న భారతీయ ఆర్మీ.. ప్రభుత్వ సూచనలతో పాకిస్తాన్ కంటి మీద కునుకుతీయలేని దెబ్బకొట్టింది. 38 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాకిస్తానీ సైనికుల కాల్చివేత, ఐదు ఉగ్ర క్యాంపులు నేలమట్టం ఇవీ కేవలం నాలుగు గంటల వ్యవధిలో 25 మంది భారతీయ సైనికులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సృష్టించిన విధ్వంసం. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



ఉడీ ఉగ్రదాడి తర్వాత భారత్ లో మరిన్ని విధ్వంసాలను సృష్టించేందుకు పీఓకేలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని నిఘా వ్యవస్ధలకు సమాచారం అందింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ను నిర్వహించేందుకు ప్రణాళిక రచించాలని సూచనలిచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అవకాశానికి భారతీయ ఆర్మీ చక్కని వ్యూహాన్ని తయారుచేసింది.



బుధవారం అర్ధరాత్రి 12.30 సమయంలో ఆర్మీకి చెందిన ధ్రువ హెలికాప్టర్లలో(అత్యాధునిక సాంకేతికత కలిగినది) 4, 9 రెజిమెంట్లకు చెందిన 25మంది పారామిలటరీ కమాండోలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించారు. ముందుగా అనుకున్న ప్రాంతాల్లో హెలికాప్టర్లు కమాండోలను వదిలేశాయి. 


టార్గెట్లను ఇలా చేరుకున్నారు


ఉగ్రవాదుల క్యాంపులను చేరుకోవడానికి పీఓకే లోపలికి మూడు కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సివుంది. దారిలో పాకిస్తాన్ సైనికుల నుంచి తప్పించుకుంటూ రాళ్లు, బురద, ల్యాండ్ మైన్లను దాటుకుంటూ.. టార్గెట్ గా ఎంచుకున్న భీంబర్, కెల్, తట్టాపని, లీలా ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంపులకు కమాండోలు చేరుకున్నారు. దాడి చేయాల్సిన క్యాంపుల్లోని ఉగ్రవాదుల కదలికలను భారతీయ నిఘా సంస్ధ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, మిలటరీ ఇంటిలిజెన్స్ లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాయి.


సర్జికల్ స్ట్రైక్(నిర్దేశిత దాడి)


నిర్దేశిత దాడికి వెళ్లిన టీం మొత్తం ఆరు క్యాంపులను దృష్టిలో పెట్టుకుంది. వీటిలో మూడింటిని భారతీయ కమాండోలు నేలమట్టం చేశారు. అత్యాధునిక ఆయుధాలైన టావర్, ఎమ్-4 తుపాకులతో పాటు గ్రేనేడ్లు, పొగ గ్రేనేడ్లు, బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్లు, చీకటిలో చూడగలిగే సాంకేతిక వస్తువులను కమాండోలు తమ వెంట తీసుకుని వెళ్లారు. కమాండోలు తలలకు పెట్టుకున్న హెల్మట్లలో కెమెరాలను అమర్చారు. క్యాంపుల వద్దకు చేరుకున్న కమాండోలు ఒక్కసారిగా ఉగ్రవాదులపై దాడి చేశారు. దాడికి జరుగుతుందని తెలిసిలోపై పొగ గ్రేనేడ్లను విసిరి ఉగ్రవాదులను మరింత గందరగోళంలో పడేశారు. పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులకు ఏం జరుగుతుందో తెలిసేలోపే 38 టెర్రరిస్టులను, ఇద్దరు పాకిస్తానీ సైనికులను హత మార్చారు. కాగా, ప్రయాణంలో ల్యాండ్ మైన్ల కారణంగా ఇద్దరు కమాండోలకు గాయాలయ్యాయి.


రాత్రంతా పర్యవేక్షిస్తూనే ఉన్న ప్రధానమంత్రి మోదీ


ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చే సమయంలో అమెరికా ఎలా మిషన్ ను నడిపిందో అచ్చం అలానే భారత రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ లు రియల్ టైంలో దాడిని వీక్షించారు. కమాండోల హెల్మెట్లలోని కెమెరాలతో పాటు ఓ డ్రోన్ దాడిని చిత్రించింది. ఎప్పటికప్పుడు దాడి వివరాలను ఫోన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాత్రంతా తెలుసుకుంటూనే ఉన్నారు.


విందు మానుకుని సమావేశం


ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఆర్మీ బుధవారం రాత్రి 8.30నిమిషాలకు పూర్తి చేసింది. కాగా, బుధవారం రాత్రి కోస్టుగార్డు కమాండర్ తో ఉన్న సమావేశం, డిన్నర్ లో పరీకర్, ధోవల్, జనరల్ సుహాగ్ లు పాల్గొనాల్సివుంది. విందును కాదన్న ముగ్గురూ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పూర్తి చేసిన ప్లాన్ ను పరిశీలించి అంగీకారం తెలిపారు.

 


దాడి తర్వాత డేగ కన్ను


సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారతీయ ఆర్మీ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ), జమ్మూకశ్మీర్, పంజాబ్ లలోని సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది. ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారుల సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఎల్ఓసీ, పంజాబ్, జమ్మూకశ్మీర్ లలోని సరిహద్దు గ్రామాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో కూడా పహారా పెంచాలని ఆర్మీ కోస్టు గార్డుకు సూచించింది.  

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top