‘హిందూ ఉగ్రవాదం’ నీరుగార్చింది

‘హిందూ ఉగ్రవాదం’ నీరుగార్చింది


ఉగ్రవాదంతో పోరుపై యూపీఏ సర్కారును దుయ్యబట్టిన రాజ్‌నాథ్

* లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ గొడవ


న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం సృష్టించిన ‘హిందూ ఉగ్రవాదం’ పదం ఉగ్రవాదంపై పోరును బలహీనపరచిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాద దాడులపై దర్యాప్తు దిశను పక్కదారి పట్టించేందుకు ఈ పదాన్ని తెచ్చారన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఉగ్రవాద దాడిపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆయన ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసింది.



లలిత్ మోదీ, వ్యాపం అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సభ్యులు గురుదాస్‌పూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన సందర్భంగాఆందోళనను పక్కనపెట్టి సీట్లలో కూర్చున్నారు. గురుదాస్‌పూర్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని రాజ్‌నాథ్ తెలిపారు. ఆయన ప్రకటన తర్వాత కాంగ్రెస్ సభ్యలు తిరిగి సభాపతి స్థానం వద్దకు దూసుకుపోయి సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. సమావేశాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని దష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ తన ప్రకటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



1962 నాటి చైనా యుద్ధం, తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం సహా పలు విషయాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఉటంకించారు. ‘‘ఉగ్రవాదం దేశానికి అతి పెద్ద సవాలుగా మారింది. దీనిని ఎదుర్కొనే విషయంలో పార్లమెంటులోకానీ, దేశంలోకానీ ఏ విధమైన విభేదాలు తగవు. ఒకవైపు మన జవాన్లు ఉగ్రవాదంపై పోరులో తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటే.. మరోవైపు సభ్యులు సభలో గలాటాను సృష్టిస్తున్నారు.. అడ్డుకుంటున్నారు. దీనిని దేశం ఎలా ఆమోదిస్తుంది?’’ అని అన్నారు. సరైన రీతిలో నోటీసిస్తే ఈ అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమన్నారు.  ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.



దీంతో రాజ్‌నాథ్ వారిపై విరుచుకుపడుతూ.. 2013లో అప్పటి హోంమంత్రి(పి.చిదంబరం) ఉగ్రవాద ఘటనలపై దర్యాప్తు దిశను పక్కకు మళ్లించేందుకోసం ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించారని, ఇది ఉగ్రవాదంపై మన పోరును బలహీనపరచిందని అన్నారు. దీనిపై పాక్‌కు చెందిన హఫీజ్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) అప్పటి హోంమంత్రిని ప్రశంసించారని గుర్తుచేశారు. అటువంటి అవమానకర పరిస్థితిని తమ ప్రభుత్వం మళ్లీ తలెత్తనివ్వబోదన్నారు. ఉగ్రవాదానికి కులం లేదా మతం ఉండదంటూ.. ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న తీవ్ర పరిణామాలపై మనమంతా తప్పక చర్చించాలన్నారు.



రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు యత్నించగా.. స్పీకర్ అనుమతించలేదు.  మధ్యాహ్నం సభ తిరిగి మొదలయ్యాక.. రాజ్‌నాథ్ రాజకీయాలకు పాల్పడుతూ పార్లమెంటును విభజిస్తున్నారని ఖర్గే(కాంగ్రెస్) ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు డిప్యూటీ స్పీకర్ తంబిదురై అంగీకరించలేదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top