ట్రిపుల్‌ తలాక్‌ తీర్పు: అసదుద్దీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రిపుల్‌ తలాక్‌ తీర్పు: అసదుద్దీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు - Sakshi


- అమలులో కఠిన సవాళ్లుంటాయన్న ఎంఐఎం



హైదరాబాద్‌:
ఇస్లాంలో ఆచారంగా కొనసాగుతోన్న ట్రిపుల్‌ తలాక్‌ విధానం.. ఖురాన్‌ నియమాలకు కూడా విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం వెలువరించిన తీర్పులో ట్రిపుల్‌ తలాక్‌పై నిషేధం విదించారు. ఈ తీర్పును ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు స్వాగతించాయి. కాగా, ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ మాత్రం తీర్పును గౌరవిస్తూనే భిన్నంగా స్పందించింది.



సుప్రీం తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం తప్పక గౌరవించాలి. అయితే ఇది ఏకపక్షంగా వచ్చిన తీర్పుకాదని గుర్తుంచుకోవాలి. తలాక్‌ రద్దు తీర్పును క్షేత్రస్థాయి అమలు చేయాలంటే చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది’’ అని అసద్‌ అన్నారు. ఈ అభిప్రాయం కేవలం తమ పార్టీ(ఎంఐఎం)ది మాత్రమేనని, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ)ది కాదని ఆయన స్పష్టం చేశారు.



ఐదుగురు జడ్జిలు.. వేరువేరు మతాలు

వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ను (ఆరు నెలలపాటు)రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది. మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న బెంచ్‌లో ముగ్గురు రద్దు నిర్ణయాన్ని సమర్థించగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు. కాగా, ఆ ఐదుగురూ ఐదు మతాలకు చెందినవారు కావడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ (సిక్కు), జస్టిస్ నజీర్ (ముస్లిం), జస్టిస్ నారిమన్ (పార్శి), జస్టిస్ లలిత్ (హిందు), జస్టిస్ కురియన్ (క్రిస్టియన్). వీరిలో ఖేహర్‌, నజీర్‌లు ట్రిపుల్ తలాక్‌ను సమర్థించగా, మిగతా ముగ్గురూ వ్యతిరేకించారు. మతపరమైన అంశాల్లో సుప్రీం జోక్యం చేసుకునేకంటే చట్టసభల్లోనే చట్టాలు రూపొందిస్తే మంచిదని రద్దును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జిలు అభిప్రాయపడ్డారు. ఆరు నెలలలోగా కేంద్రం ట్రిపుల్‌ తలాక్‌పై చట్టం రూపొందించాలన్న సూచన కూడా వీరు చేసిందే కావడం విశేషం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top