ఇది ప్రకృతి వైపరీత్యం కాదా ?

ఇది ప్రకృతి వైపరీత్యం కాదా ?


న్యూఢిల్లీ: దేశంలో ఏటా వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న చండ ప్రచండ వడ గాలులు ప్రకృతి వైపరీత్యం కాదా ? చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చినప్పుడు, అదే కోవకు చెందిన వడ గాలులను మాత్రం ప్రకృతి వైపరీత్యాల జాబితాలో ఎందుకు చేర్చరు? 2012లో ఉత్తర భారతాన్ని అతి శీతల గాలులు గజగజ వణికించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు భారత ప్రభుత్వం చలి గాలులను ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వడ గాలులతో దేశంలో 1150 మందిని, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 మందిని బలితీసుకున్నాయి.



2004 నుంచి 2014 వరకు దేశంలో వడ గాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 63 శాతం పెరిగిదంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ఈపాటికే గుర్తించినట్లయితే వందలాది మంది ప్రజల ప్రాణాలను పరిరక్షించి ఉండే వాళ్లమని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంఘం (ఎన్డీఎంఏ) సీనియర్ సభ్యుడు కమల్ కిషోర్ తెలిపారు.



ఇదే సంఘానికి చైర్మన్‌గా పని చేసిన తెలంగాణ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తన హయాంలో వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించేందుకు తన వంతు కృషి తీవ్రంగానే చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ గాలులకు దాదాపు 1150 మంది మరణించడంతో (ఆ ఏడాది దేశవ్యాప్తంగా 1450 మంది మరణించారు) చలించిన శశిధర్ రెడ్డి వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలనే ప్రతిపాదనను అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.


స్పందించిన ఆయన చిదంబరం, శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే, హరీష్ రావత్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పలు సార్లు సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మర్రి శశిధర్ రెడ్డి ప్రతిపాదన అటకెక్కింది.



 ప్రస్తుతం జాతీయ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో భూకంపాలు, తుఫాన్లు, కరువు కాటకాలు, కొండ చెరియలు విరిగి పడడం, వడగళ్ల వర్షాలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణం సంభవిస్తే లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక్కడ ప్రాణ నష్టానికి పరిహారం ముఖ్యం కాదని, ముందస్తు నివారణ చర్యలకు ఎంతో అవకాశం ఉంటుందని కమల్ కిషోర్ చెప్పారు.


వడ గాలులను ప్రకృతి వైపరీత్యంగా ప్రభుత్వం గుర్తించినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సమన్వయంతో నష్ట నివారణ చర్యలు చేపడుతాయని అన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో వడ గాలుల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, వారికి సరైన సమ్మర్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top