మీడియాను ఆర్టీఐ పరిధిలోకి తేవాలి

మీడియాను ఆర్టీఐ పరిధిలోకి తేవాలి - Sakshi


జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమన్న గవర్నర్

* బ్రేకింగ్ పేరిట సంచలనాలను జనంపై రుద్దొద్దు

* నా సోదరుడు చనిపోతే ‘కైసా లగ్తా హై’ అని నన్నడిగారు

* నేను దేవాలయాలకు వెళ్లినా వార్తేనా?

* నా సేవలను కాదు, వయస్సును గౌరవించండి

* మీడియాకూ ప్రవర్తన నియమావళి ఉండాలి

* సామాజిక బాధ్యత ఉండాలన్న నరసింహన్

* జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్రం తరఫున కృషి: దత్తాత్రేయ

* మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి: కేటీఆర్




సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీడియాను కూడా సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరముందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అభిప్రాయపడ్డారు. మీడియాకు కూడా ప్రవర్తన నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉండాలన్నారు. ‘‘కొన్ని అంశాల్లో మీడియా సంస్థలకు జవాబుదారీతనం తప్పనిసరి. బ్రేకింగ్ న్యూస్ పేరుతో సెన్సేషనలిజాన్ని ప్రజలపై రుద్దకుండా సమాజానికి మేలు చేసే అంశాలపై మీడియా దృష్టి సారించాలి’’ అని సూచించారు. ‘‘ప్రతి అంశాన్ని సంచలనం చేసే ప్రయత్నం కూడదు. కొన్ని విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలే తప్ప ఆ సంఘటనలను ఫొటోలు, వీడియోలు తీసి సంచలనం చేయాలనే దృ   క్పథాన్ని వీడాలి.



సెన్షేషనలిజం కొన్ని క్షణాలే బాగుంటుంది.నిస్సహాయులకు సాయం చేయడం ఆత్మ సంతృప్తినివ్వడంతో పాటు సమాజానికి మేలు చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీడియాపై తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు అసహనంతో కూడినవి కావని, జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా మాట్లాడుతున్నానని చెప్పారు. మీడియాలో సంస్కరణలు రావాలన్నారు.



జర్నలిస్టులు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, ఊహించి వార్తలు రాయడం మాని వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. మానవమాత్రులుగా సహజంగా జరిగే తప్పులను సరిచేయాలే తప్ప ప్రతి అంశాన్నీ విమర్శించకూడదన్నారు. మీడియా చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అమెరికాపై, ముంబైపై ఉగ్ర దాడుల ((9/11, 26/11) సమయంలో మీడియా పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.



జర్నలిస్టులు వార్తలు రాయడమే కాకుండా ఆయా అంశాలను విశ్లేషణ దృష్టితో చూడాలన్నారు. మీడియా గురించి నెపోలియన్, గాంధీజీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, ఫోర్త్ ఎస్టేట్‌గా బాధ్యతతో వ్యవహరించడం సమాజానికి శ్రేయస్కరమన్నారు.

 

స్వతంత్రంగా వ్యవహరించాలి: దత్తాత్రేయ

ప్రజాస్వామ్యాన్ని కాపాడే జర్నలిస్టులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. ‘‘మీడియా సంస్థలు మజీతియా బోర్డు నివేదికను అమలు చేయాలి. ఇందుకోసం కేంద్ర కార్మికమంత్రిగా నా వంతు కృషి చేస్తా. పీఎఫ్ పరిధిలో ఉన్న జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు ఇవ్వాల్సిన అవసరముంది. అందుకోసం నేను పాటుపడతానన్నారు.



మీడియాలో పని చేసే సిబ్బంది కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రక్రియలో నేనూ భాగస్వామినవుతా’’ అని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 కోట్ల కేటాయింపు, వారికి హెల్త్ కార్డులు, జర్నలిస్టు భవన్, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితరాలపై కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.



కొన్ని మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరిస్తున్నాయని ఆక్షేపించారు. ప్రెస్ క్లబ్ లీజు పెంపు, మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి రాజమౌళిచారి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వివరించారు. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేను గుడికెళ్తే తప్పా?

‘‘గవర్నర్‌గా నేనెక్కడికి వెళ్లినా దాన్ని వార్తగానే పరిగణిస్తున్నారు. నేను ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయనకిచ్చిన 35 పేజీల నివేదికలోని  ముఖ్యాంశాలు చెప్పమని ఢిల్లీలో మీడియా నన్నడిగింది’’ అని

 నరసింహన్ గుర్తు చేశారు. ప్రధానికి ఏం చెప్పాననే దానిపై ఊహా గానాలు, తాను దేవాలయాలకు వెళ్లడాన్ని వార్తలుగా ప్రచురించడాన్ని తప్పుపట్టారు. గవర్నర్ దేవాలయాలకు వెళ్లడం తప్పు కాదు, వార్తా కాదన్నారు.



అస్సాంలో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన తన సోదరుడి పార్థీవ దేహాన్ని తీసుకొస్తుంటే, ‘కైసా లగ్తాహై’ అని మీడియా తనను ప్రశ్నించిందన్నారు. ఇలాంటి పరిణామాలు సమాజానికి హితం కావన్నారు. ‘‘అధికారిగా, గవర్నర్‌గా నేను చేసిన సేవలకు నాకు విలువ ఇవ్వమనడంలేదు.నా వయసును గౌరవించమని కోరుతున్నా. 35 ఏళ్లుగా అధికారికంగా మీడియాకు దూరంగానే ఉన్నా. వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగించా’’ అని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top