ఇస్రో సూపర్ సిక్స్

ఇస్రో సూపర్ సిక్స్


అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం మరో ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇస్రో గురువారం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ - డీ6 రాకెట్.. 2,117 కిలోల బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్‌లో వినియోగించిన క్రయోజనిక్ ఇంజన్.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్ కావటం ఈ ప్రయోగంలో ప్రధాన విశేషం. దేశీయ క్రయోజనిక్ ఇంజన్ వినియోగంతో ఇస్రో మూడు రాకెట్లు ప్రయోగించగా.. తొలి రాకెట్ విఫలమవగా..



వరుసగా రెండు రాకెట్లు విజయవంతమయ్యాయి. దీంతో.. శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడుతోంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే ప్రయోగించే సామర్థ్యాన్ని ఇస్రో బలోపేతం చేసుకున్నట్లయింది. జీశాట్ ఉపగ్రహాల వరుసలో తాజాగా ప్రయోగించిన జీశాట్-6 రజతోత్సవ ఉపగ్రహం కావటం ఒక విశేషమైతే.. ఉపగ్రహ వాహకనౌక ‘సిక్స్’ కావటం, ఉపగ్రహం కూడా ‘సిక్స్’ కావటమే కాదు.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగంలో కూడా ఇస్రోకు ఇది ఆరో విజయం. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో 48వ విజయం.

 

జీఎస్‌ఎల్‌వీ డీ6 రాకెట్‌తో నింగిలోకి జీశాట్-6 ప్రయోగం

స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో రెండవ విజయం

రజతోత్సవ జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపిన రాకెట్

రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు భద్రమైన సమాచార వ్యవస్థ

ఈ విజయం శాస్త్రవేత్తల 17 ఏళ్ల కృషి ఫలితం: ఇస్రో చైర్మన్ కితాబు


సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్). గురువారం సాయంత్రం 4:30గంటల సమయం. మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల వదనాల్లో ఉత్కంఠ. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ ను వినియోగించి మూడోసారి చేస్తున్న ప్రయోగం.



ఈ ఇంజన్‌తో తొలి ప్రయోగం విఫలమైంది.. మలి ప్రయోగం విజయవంతమైంది. మూడో ప్రయోగ మూ దిగ్విజయం కావాలన్న పట్టుదల. ఈ ఇంజన్ తో జీఎస్‌ఎల్‌వీ - డీ6 రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11:52 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 29 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. గురువారం సాయంత్రం 4:52 గంటలకు.. సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టు, వన్, జీరో అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపు మళ్లాయి. క్షణాల్లో ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ జీఎస్‌ఎల్‌వీ- డీ6 నింగిలోకి దూసుకెళ్లింది.



నిర్దేశిత గమనంలో దశల వారీగా విజయవంతంగా ప్రయాణించింది. బయల్దేరిన తర్వాత సరిగ్గా 17:04 నిమిషాల్లో జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మిషన్ కం ట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. విజయానంతరం ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొన్నారు. క్రయోజనిక్ ఇంజన్‌ను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు 17ఏళ్లుగా చేసిన కృషి ఫలించిందని ప్రశంసించారు.  

 

రాకెట్ ప్రయోగం సాగిందిలా:జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగంలో.. 170.4 టన్నుల నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్‌అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం సాయంతో 151సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. 39.5 టన్నుల ద్రవ ఇంధనం సాయం తో 293 సెకన్లలో రెండో దశను దిగ్విజయంగా పూర్తిచేశారు. తరువాత అత్యంత కీలక దశ అయిన మూడో దశను కూడా 12.8 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,012 సెకన్లలో పూర్తి చేశారు.



మొత్తం 17.04 నిమిషాల్లోనే 170 కిలోమీటర్లు పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజి (భూమికి దూరంగా) భూ సమాంతర కక్ష్యలో 19.95 డిగ్రీల వాలులో జీశాట్-6 ఉపగ్రహాన్ని విజయవంతంగా చేర్చింది. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం ఆరోగ్యంగా ఉన్నట్లు హసన్ (కర్ణాటక) లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. మాస్టర్‌కంట్రోల్ శాస్త్రవేత్తలు జీశాట్-6 ఉపగ్రహం లో ఉన్న ఇంధనాన్ని మండించి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరపరిచే ప్రక్రియ చేపడతారు.

 

ఇస్రో ప్రయోగించిన 25 సమాచార ఉపగ్రహాలలో ప్రస్తుతం 10 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 225 ట్రాన్స్‌పాండర్లతో దేశవాళికి డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు, టెలీ మెడిసన్, టెలీ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తున్నాయి. సమాచార రంగంలో ఎప్పటికప్పుడు  మార్పులు వస్తుండడంతో అందుకు తగినట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు దేశంలో 500 ట్రాన్స్‌పాండర్ల దాకా డిమాండ్ ఉన్నాయి. రాబోయే మూడు, నాలుగేళ్లలో 450 ట్రాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవటం ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఉపగ్రహం ఉపయోగాలు

జీశాట్-6 సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనిద్వారా రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు మరింత భద్రమైన సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. శాటిలైట్ ఫోన్లతో ఈ వర్గాల వారు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఇతర ప్రాంతాల వారితో సంభాషించేందుకు అవకాశమేర్పడుతుంది.



జీశాట్ -6లో ఎస్ బ్యాండ్ ద్వారా 5 స్పాట్ బీమ్స్, సీ బ్యాండ్‌లో ఒక జాతీయ స్థాయి బీమ్ అందుబాటులోకి వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీని అత్యంత సమర్థంగా వాడుకునేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో సమాచారాన్ని సురక్షితంగా ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గతంలో ఏ ఉపగ్రహంలో లేని అతి పెద్ద యాంటెన్నాను ఈ ఉపగ్రహంలో ఏర్పాటు చేశారు. ఆరు మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ యాంటెన్నా వల్ల ఉపగ్రహం నుంచి సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకునే వీలుంటుంది. ఈ ఉపగ్రహం తొమ్మిదేళ్ల పాటు సేవలందిస్తుందని ఇస్రో ప్రకటించింది.

 

‘అద్భుత విజయం’

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జీశాట్-6ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన ఇస్రో బృందానికి ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు అభినందనలు తెలిపారు. ఇది భారత శాస్త్రవేత్తల అద్భుత విజ యమని ప్రధాని ట్విటర్‌లో అభినందించారు. ఈ గెలుపు మరో గర్వకారణమైనదని సోనియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఇస్రో మరెన్నో విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

 

ప్రయోగం వివరాలివీ...

ప్రయోగ వ్యయం    :    రూ. 210 కోట్లు

జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ ఖర్చు    :    రూ. 160 కోట్లు

జీశాట్-6 ఉపగ్రహం ఖర్చు    :     రూ. 50 కోట్లు

జీఎస్‌ఎల్‌వీ డీ6 రాకెట్ పొడవు     :     49.1 మీటర్లు

రాకెట్ ప్రయోగంలో మొత్తం బరువు    :     416 టన్నులు

జీశాట్-6 ఉపగ్రహం మొత్తం బరువు    :    2,117 కిలోలు

ఉపగ్రహంలో ఇంధనం బరువు    :    1,132 కిలోలు

కేవలం ఉపగ్రహం బరువు    :    985 కిలోలు

నింగికి చేరిన సమయం    :    17.04 నిమిషాలు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top