2020 నాటికి ఎగుమతులు 900 బిలియన్ డాలర్లు!

2020 నాటికి ఎగుమతులు 900 బిలియన్ డాలర్లు! - Sakshi


మోదీ ప్రభుత్వ లక్ష్యం ఇది..



• ఎగుమతులను రెట్టింపు చేసేలా తొలి విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ

• కొత్త మార్కెట్ల అన్వేషణకు వ్యూహాలు


 

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ మొట్టమొదటి విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ) భారీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. 2020 నాటికి ఈ పరిమాణం 900 బిలియన్ డాలర్లుగా ఉండాలన్న ధ్యేయంతో ఉన్నట్లు విధానం స్పష్టం చేసింది.  2013-14లో భారత వ్యాపార ఎగుమతులు 312 బిలియన్ డాలర్లు. సేవల రంగాన్ని కూడా కలుపుకుంటే ఈ విలువ దాదాపు 466 బిలియన్ డాలర్లు ఉంది.  2014-15 ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఎగుమతులు నమోదుకావచ్చని గణాంకాలు పేర్కొంటున్నాయి.



ఈ నేపథ్యంలో కేంద్రం ఐదేళ్లకు (2015-2020) సంబంధించి బుధవారం తాజా విధానాన్ని విడుదల చేసింది. లక్ష్యాలను సాధించే క్రమంలో వాణిజ్య విధానాన్ని ఇకపై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ వార్షికంగా ఈ సమీక్ష జరుగుతోంది.  ప్రస్తుతం ప్రపంచ మొత్తం వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 2 శాతం. ఈ రేటును 3.5 శాతానికి పెంచాలన్నది లక్ష్యమని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ తెలిపారు.



ఈ దిశలో కొత్త మార్కెట్ల అన్వేషణకు దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రపంచ స్థాయిలో భారత వాణిజ్య వాటా పెంపు లక్ష్యంగా ట్రేడ్ కౌన్సిల్ అండ్ నేషనల్ కమిటీసహా పలు సంస్థల ఏర్పాటును వాణిజ్య విధానం ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం పునరుద్ధరణ డిమాండ్‌పై ఆయన సమాధానం ఇస్తూ, దీని అమలుకు వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేబినెట్ ఆమోదాన్ని కోరనున్నట్లు తెలిపారు.



మేక్ ఇన్ ఇండియాకు అనుసంధానం..



మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో అనుసంధానం ద్వారా.. భారీ ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఎఫ్‌టీపీని రూపొందించినట్లు విధాన ప్రకటన కార్యక్రమం సందర్భంగా  వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు, ప్రత్యేక ఆర్థిక జోన్లకు(ఎస్‌ఈజెడ్) తమ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని తెలిపారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.



రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి ఒక వ్యవస్థాగత ఫ్రేమ్‌వర్క్ ద్వారా దేశ ఎగుమతుల వృద్ధికి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్(ఈపీఎం)ను ఆవిష్కరించనున్నట్లు ఎఫ్‌టీపీ సూచించింది. రక్షణ, ఫార్మా, పర్యావరణ సానుకూల ఉత్పత్తులు.. అలాగే విలువ ఆధారిత ఎగుమతులపై కొత్త పాలసీ దృష్టి పెడుతుందని తెలిపారు. తయారీ, కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధికీ పాలసీలో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ-కామర్స్ కంపెనీల ఎగుమతి ప్రొడక్టులకు కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని, ఇది ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడుతుందని తెలిపారు.





2 కొత్త స్కీమ్‌లు..: ఎగుమతుల పెంపు లక్ష్యంగా...  గతంలో ఉన్న పలు ‘క్లిష్ట విధానాల’ స్థానంలో కొత్తగా  రెండు పథకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్), సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్‌ఈఐఎస్) పథకాలను  తాజాగా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకాల అన్ని ప్రయోజనాలను ఎస్‌ఈజెడ్‌లలోని యూనిట్లకు కూడా అందించనున్నట్లు తెలిపారు.



ఎస్‌ఈఐఎస్ భారత్‌లోని ‘సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.  ఎంఈఐఎస్ కింద ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ అగ్రికల్చరల్, ఆహార వస్తువులు, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులకు ప్రయోజనం కల్పించనున్నట్లు వెల్లడించారు.  ప్రస్తుత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలు ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని కోరుతున్నట్లు పేర్కొన్న మంత్రి, దీనికి కట్టుబడి ఉంటూనే ఎగుమతుల వృద్ధి వ్యూహాలను కేంద్రం రూపొందిస్తోందన్నారు. యోగా, హస్త కళల వంటి భారత సాంప్రదాయక అంశాలు, తత్సంబంధ సేవలను కూడా ‘సేవా సంబంధ’ ఎగుమతుల కేటగిరీలో చేర్చాలని ఎఫ్‌టీపీ పేర్కొంది.



మిశ్రమ స్పందన...



తాజా విధానంపై సంబంధిత వర్గాల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) డెరైక్టర్ జనరల్, సీఈఓ అజయ్ షాహీ మాట్లాడుతూ... గతానికన్నా భిన్నంగా సానుకూలంగా విధానం ఉందన్నారు. తాజా సమస్యలను ఈ విధానం గుర్తించి, అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించిందని అన్నారు. కాగా,ఇది కొత్త సీసాలో పాత సారాను తలపిస్తోం దని వాణిజ్య నిపుణులు, బిజి నెస్ స్టడీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ్ గోయల్ అన్నారు.

 

వైజాగ్, భీమవరంకు ప్రత్యేక హోదా..

 

తాజా పాలసీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరంను ‘టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ’ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోకి ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక పరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక హోదా 21 నగరాలు, పట్టణాలకు ఉంది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 23కు చేరింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top