'మెమన్ ఉరితీత'లో మానవీయంగా వ్యవహరించారు

'మెమన్ ఉరితీత'లో మానవీయంగా వ్యవహరించారు


- కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ఎస్ఎస్ కితాబు




న్యూఢిల్లీ: ముంబై పేళుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు, అనంతర పరిణామాలలో ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరించిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభిప్రాయపడింది. శిక్ష అమలుకు ముందు కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం యాకూబ్కు కల్పించడం, ఉరి తర్వాత మృతదేహాన్ని అప్పగించడం, అంత్యక్రియల్లో బంధువులు, ఇతరులను అనుమతించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం తన మానవత్వాన్ని.. మరీ ముఖ్యంగా భారతీయతను చాటుకున్నదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ అన్నారు. శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడంతో ప్రభుత్వం తాను చేయగలిగిందంతా చేసిందన్నారు.



'మెమన్కు ఉరిశిక్ష అమలైతే అనేక చోట్ల అనూహ్య పరిణామాల తలెత్తే అవకాశం ఉన్నదని సర్వత్రా భావించారు. కానీ అలా జరగలేదు. న్యాయస్థానం తీర్పులు మాత్రమే ఇవ్వగలుగుతాయికానీ ఆ తరువాత తలెత్తే పరిణామాలకు బాధ్యత వహించదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. మెమన్ ఉరి అనంతర పరిస్థితులను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించగలిగింది' అని ఇంద్రేశ్ అన్నారు. మెమన్ అంత్యక్రియలు జరిగిననాడే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలూ జరిగాయని గుర్తుచేస్తూ.. మెమన్ గురించి మాత్రమే మాట్లాడి కలాంకు నివాళులు అర్పించనివారంతా మతవాదులేనని ఆరోపించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top