ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సర్కారు దొంగాట

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సర్కారు దొంగాట - Sakshi

  •      హోదాకోసం తీర్మానం చేయాలంటూ విపక్షం పట్టు

  •      వాయిదా తీర్మానం తిరస్కరణ... సంతాప తీర్మానాలు

  •      హోదాపై తీర్మానం అంటూ డ్రామా నడిపించిన అధికారపక్షం

  •      దాని ప్రస్తావన లేకుండానే ముగించిన చంద్రబాబు

  •  

     సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటు వైఖరి స్పష్టమైంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వాలని శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్‌పై ప్రభుత్వం వ్యూహాత్మకంగా దాటవేత వైఖరిని ప్రదర్శించింది. హోదాపై తీర్మానం చేయాల్సిందేనని ప్రతిపక్షం అసెంబ్లీలో గొంతెత్తి నినదించినప్పటికీ పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించింది. శాసనసభ వర్షాకాల సమావేశాలు తొలిరోజున ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం సభ వాయిదా పడేంతవరకు ప్రభుత్వం హైడ్రామా నడిపి చివరకు ముఖ్యమంత్రి ప్రకటనతో ముగించింది. ముఖ్యమంత్రి చేసిన ఆ ప్రకటనలో కూడా ఎక్కడా తీర్మానం చేద్దామని ప్రతిపాదించలేదు. పైగా ముఖ్యమంత్రి ప్రకటనలోని అంశాలను పక్కనపెట్టి ప్రతిపక్షంపై విమర్శలకు దిగారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటినుంచి మధ్యాహ్నం వాయిదా పడేంతవరకు ప్రత్యేక హోదాపై సభ అట్టుడికింది. సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా తీర్మానాన్ని అనుమతించాలని యావత్తు ప్రతిపక్ష సభ్యులు లేచి డిమాండ్ చేశారు. 'మీ ప్యాకేజీల కోసం ఆంధ్రప్రదేశ్‌ను బలిపెట్టకండి' ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాదే' వంటి నినాదాలున్న ప్లకార్డులు ప్రదర్శించారు.


    'ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం' 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' 'ప్రభుత్వ వైఫల్యంతోనే బలిదానాలు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో స్పీకర్‌కు, ప్రతిపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. తిరస్కరించిన తీర్మానంపై చర్చ ఉండదని స్పీకర్ అన్నప్పుడు... సమస్య తీవ్రతను గుర్తించాలని, తమ నాయకునికి మైకు ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో జగన్‌ను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. 'ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్లు రాకమునుపే మిమ్మల్ని (స్పీకర్) కలిసి తీర్మానానికి నోటీసు ఇచ్చాం. సభలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని కోరాం. దానికి బలం రావాలంటే వాళ్ల (టీడీపీ) కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే..'అని జగన్ అంటుండగానే మైకు కట్ అయింది. స్పీకర్ జోక్యం చేసుకుని విపక్షం కన్నా ముందే అధికార పక్షం నోటీసు ఇచ్చిందని, ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తెలిపిందని చెప్పారు. తీర్మానాన్ని చర్చించేటప్పుడు అన్ని విషయాలు మాట్లాడవచ్చని, తిరస్కరించిన వాయిదా తీర్మానంపై చర్చ వద్దని స్పీకర్‌కు యనమల సూచించారు. తీర్మానం చేయాల్సిందేనని విపక్షం పట్టుబట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది.

     చర్చలేకుండా ప్రశ్నోత్తరాలు

     సంతాప తీర్మానాల తర్వాత సంతాప సూచకంగా సభ కాసేపు వాయిదా పడి మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశం మీద చర్చకు విపక్షం పట్టుబట్టినా స్పీకర్ అంగీకరించకుండా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి అనుమతించారు. దీనిపై విపక్ష నేత జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టినట్లు శాసనసభ చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రత్యేక హోదాపై చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ వాయిదా పడటానికి అరగంట ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రకటన చేసే అవకాశం కల్పిస్తారు. ఈ రోజంతా ఆయన మాటలే వినపడాలని, ప్రజల గొంతుక వినిపించే ప్రతిపక్షం మాట వినిపించకూడదు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు నవ్వులోనే అధికారపక్షం కుట్ర కనపడుతోంది. ప్రశ్నోత్తరాలను పక్కనబెట్టి నేరుగా చర్చలోకి వెళదాం'అని జగన్ పట్టుబట్టారు. కానీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయని స్పీకర్ ప్రకటించారు. తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టగా అవకాశం ఇచ్చారు. 'సభను 15 రోజులకు పెంచమని మొత్తుకొని చెప్పినా పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా కోసం ముగ్గురు పిల్లలు చనిపోయిన నేపథ్యంలో.. ఈ అంశం మీద చర్చ కోసం నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు 12.24 గంటల తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టారు.  ఈ సమయంలో ప్రశ్నోత్తరాలు చేపట్టడం శాసనసభ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? హోదా మీద చర్చ జరగకూడదనే ఇలా చేస్తున్నారు. సంతాప తీర్మానం మీదా విపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రిని 15 నిమిషాలు మాట్లాడనిచ్చి.. ముగించారు. విపక్షంగా మేము పోరాటం చేస్తున్నది చంద్రబాబుతోనా? స్పీకర్‌తోనా? అర్థం కావడం లేద’ని ఆవేదన వ్యక్తంచేశారు.

     విపక్షనేతపై విమర్శలు

     జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్.. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు మైక్ ఇచ్చారు. అధ్యక్షస్థానాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని, అందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత  అచ్చెన్నాయుడు.. విపక్ష సభ్యులు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ జోక్యం చేసుకొని.. ‘మూర్ఖత్వం’ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. అధికారపక్షం రూపొందించిన ఎజెం డాకు తాము అంగీకరించామని చెప్పడం సత్యదూరమన్నారు. సంతాప తీర్మానాల మీద చర్చ జరిగే సమయంలో.. ఏరకంగా చనిపోయారనే చర్చించి స్పష్టంగా చెప్పగలిగితే వారి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఎవరి అసమర్థత వల్ల వారు చనిపోయారనే విషయంలో తమ నేత చెప్పింది అక్షరాలా నిజమని చెప్పారు.   హోదా మీద చర్చ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు.

     హోదాపై చర్చకు జగన్ పట్టు

     'హోదా మీద చర్చ చేపడదామని సభ మొదలైనప్పటి నుంచి మొత్తుకుంటున్నా వినడం లేదు. శనివారం బంద్ జరిగింది. ఇప్పుడు శాసనసభలో చర్చ ఏవిధంగా జరుగుతుందో అని ప్రజలు ఎదురు చేస్తున్నారు. కానీ చర్చలోకి పోకుండా తప్పించుకోవడానికి అధికారపక్ష సభ్యులకు ఒకరితర్వాత మరొకరికి మైక్ ఇస్తున్నారు. చివరి 45 నిమిషాల్లో చంద్రబాబు రావాలి.. ప్రకటన చేయాలి.. అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. ఇలా చేస్తే ప్రజా సమస్యలు పక్కదోవ పట్టవా?'అని జగన్ నిలదీశారు. అధ్యక్ష స్థానం, సభ మీదా బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని స్పీకర్ అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాకుండా, ఇష్టమొచ్చినప్పుడు మాట్లాడతానని అడగకూడదని సూచించారు. దీనికి జగన్ అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలిపారు. సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు 12.48 గంటలకు స్పీకర్ ప్రకటించారు.

     ప్రతులు ఇవ్వకుండా సీఎం ప్రకటన

     1.20 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రికి ప్రకటన చేసే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. కనీసం ప్రకటన ప్రతులు కూడా ఇవ్వకుండానే సీఎం ప్రకటన చేయడం మొదలుపెట్టడాన్ని జగన్ తప్పుబట్టారు. కాసేపటి తర్వాత ఒక కాపీ విపక్ష నేతకు చేరింది. విభజనలో సమన్యాయం చేయమని తాను చెప్పినా కేంద్రం పట్టించుకోలేదంటూ.. ప్రత్యేక హోదా ప్రకటనను సీఎం మొదలుపెట్టారు. పార్లమెంట్ తలుపులు మూసి, రాజ్యాంగ నియమాలు పాటించకుండా విభజన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిందని విమర్శించారు. ప్రత్యేక హోదాకోసం అప్పట్లో ఎంపీగా ఉన్న జగన్ ప్రయత్నించలేదని, బీజేపీ నేతలు వెంకయ్య, అరుణ్‌జైట్లీ పట్టుబట్టారని చెప్పారు. అప్పట్లో కేంద్రంపై పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ పార్టీ ఎంపీలు జగన్, మేకపాటి ఆఖరు నిమిషంలో ఉపసంహరించుకున్నారని విమర్శించారు.

     

     జగన్ మాట్లాడేందుకు అనుమతి నిరాకరణ

     సీఎం లేనిపోని ఆరోపణలకు దిగడంపట్ల విపక్ష నేత జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన పేరు ప్రస్తావించినందున తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత దాని మీద చర్చ ప్రారంభించే అవకాశం విపక్ష నేతకే వస్తుందని, అప్పుడే మాట్లాడాలని స్పీకర్ చెప్పారు. కనీసం ప్రకటన ప్రతులు కూడా ఇవ్వకుండా ప్రకటన చేయడానికి సీఎంను అనుమతించడం, విపక్ష నేత పేరు ప్రస్తావించినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమ నేతకు మైక్ ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో... టీడీపీ మొండి వైఖరి నశించాలి.. అధికారపక్షం అప్రజాస్వామిక విధానం నశించాలి.. వియ్ వాంట్ జస్టిస్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. నినాదాల హోరులోనే యనమల జోక్యం చేసుకొని.. నిబంధన-338 ప్రకారం ప్రభుత్వం ప్రకటన చేసే సమయంలో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. తర్వాత బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు, టీడీపీ సభ్యులు కాగితం వెంకట్రావు, బోండా ఉమ విపక్ష నేత మీద విమర్శలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలు కొనసాగుతుండగా.. బీజేపీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు జగన్ స్థానం వద్దకు వచ్చి చర్చించడం కనిపించింది. నినాదాల మధ్య 2 గంటల సమయంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top