సర్కారు ఆస్పత్రులు ప్రైవేటుపరం

సర్కారు ఆస్పత్రులు ప్రైవేటుపరం


- సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు


- పైలట్ ప్రాజెక్టుగా ‘ఈ-వైద్య’ కంపెనీకి 4 ఆస్పత్రుల అప్పగింత


- ప్రైవేటు సంస్థకే నేరుగా నిధులు చెల్లించేలా ఏర్పాటు


 


సాక్షి, హైదరాబాద్: సర్కారు వైద్యం ఇక ప్రైవేట్‌పరం కానుంది. నిర్వహణ బాధ్యతలనూ ప్రైవేట్ సంస్థలే చేపట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామా లు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థల చేతికి అప్పగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ-వైద్య అనే సంస్థకి పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమిక ఆసుపత్రులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వైద్యసేవల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 104 వ్యవస్థను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించేందుకు యోచిస్తోంది.


 


వైద్యులు, సిబ్బంది, సేవలన్నీ ‘ప్రైవేట్’కే...


గ్రామీణ ప్రాంతాల్లో 685 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో దాదాపు 177 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీలకు రాష్ట్ర ప్రభు త్వం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీ    య పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్‌యూహెచ్‌ఎం) నుంచి నిధులు వస్తున్నాయి. పీహెచ్‌సీకి నెలకు సుమారు రూ.2 లక్షలను ప్రభుత్వం కేటాయిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కో చోట ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, సిబ్బంది ఉంటారు. పీహెచ్‌సీల్లో డాక్టర్‌సహా ఇతర సిబ్బంది ఉండాలి.


 


కానీ, వీటిల్లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడంలేదన్న విమర్శలు ఉన్నాయి. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వాటిల్లోని మౌలిక సదుపాయాలను కూడా ఆ సంస్థలకే కట్టబెడుతుంది. ఆసుపత్రులకు ఇస్తున్న నిధులను నేరుగా ఆ సంస్థలకే విడుదల చేస్తుంది. ఆ నిధులతో సంస్థలు ఆసుపత్రులను తమకు అనుగుణంగా తీర్చిదిద్దుతాయి. వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందిని నియమించుకుంటాయి. వైద్య పరీక్షలు, ఔషధాల పంపిణీ కూడా ఆ సంస్థే చూసుకుంటుంది.


 


ఫీజు ఉంటుందా.. ఉండదా?


ప్రైవేటు చేతికి ప్రాథమిక ఆసుపత్రుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నందున రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తారా? లేదా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలకు నిధులిచ్చి నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నందున ఫీజులు వసూలు చేయబోరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవ నీ, సకాలంలో ఇవ్వకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top