బడికి వెళ్తే రూ.5 వేలు జరిమానా!

బడికి వెళ్తే రూ.5 వేలు జరిమానా!


నిజామాబాద్ జిల్లా పోతాయిపల్లి గ్రామస్తుల తీర్మానం

లింగంపేట: విద్యార్థులు బడికి వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలో చోటు చేసుకుంది. పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో విజయ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పాఠశాలలో 220 మంది విద్యార్థులున్నారు. ఆ గ్రామం పొరుగున ఉన్న కోమట్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 92 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు.



ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం తో అధికారులు విజయ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై కోమట్‌పల్లి పాఠశాలకు పంపారు.  అయితే, ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఆ ఉపాధ్యాయుడి డిప్యుటేషన్‌ను అధి కారులు తొలగించి తిరిగి పోతాయిపల్లి స్కూల్‌కు పంపారు. ఆ  ఉపాధ్యాయుడి  డిప్యుటేషన్ రద్దుపై కోమట్‌పల్లి గ్రామస్తులు విద్యాశాఖ సిబ్బందిని నిలదీశారు. సదరు ఉపాధ్యాయుడిని కోమట్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు పంపాలి.. లేదంటే మా గ్రామం నుంచి వచ్చే 120 మంది విద్యార్థులను పోతాయిపల్లికి పంపబోమని తీర్మానించుకున్నారు.



ఎవరైనా వెళితే రూ. ఐదు వేల జరిమానా విధించాలని తీర్మా నించారు. సదరు ఉపాధ్యాయుడు కోమట్‌పల్లి పాఠశాలలో విధులు నిర్వర్తించాలి, లేదంటే తమ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ స్కూల్‌లో బోధించడానికి వీలులేదని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కోమట్‌పల్లిలో 6 నుంచి 10వ తరగతి వరకు ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు వెళ్లడం లేదు.



పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో సగం మంది కోమట్‌పల్లి గ్రామస్తులే కావడం విశేషం. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్యను సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్క ఉపాధ్యాయుడి కోసం దశాబ్దాలుగా కలిసి ఉన్న రెండు గ్రామాల్లో చిచ్చు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top