గ్లో 'బుల్' ర్యాలీ...!

గ్లో 'బుల్' ర్యాలీ...!


సెన్సెక్స్ 565 పాయింట్లు అప్.. 26,786 వద్ద క్లోజ్

అంచనాల కంటే తక్కువగా అమెరికా ఉద్యోగ గణాంకాలు

దీంతో ఫెడ్ రేట్ల కోత ఈ ఏడాది ఉండకపోవచ్చని అంచనాలు

ఈ అంచనాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల జోరు

168 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ... 8,119 పాయింట్లకు జూమ్

స్టాక్ సూచీల ఒక్క రోజు అధిక లాభాలు... ఈ ఏడాదిలో ఇది రెండోసారి


 

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభాన్నిచ్చింది.  అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవన్న అంచనాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడడంతో మన స్టాక్ మార్కెట్ కూడా సోమవారం లాభాల్లో ముగిసింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 565 పాయింట్లు(2.15 శాతం) లాభపడి 26,786 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168 పాయింట్లు (2.12 శాతం) లాభపడి 8,119 పాయింట్ల వద్ద ముగి శాయి. ఈ ఏడాది జనవరి 15 తర్వాత దాదాపు తొమ్మిది నెలల్లో ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీలు  ఇన్ని ఎక్కువ పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. జనవరి 15న సెన్సెక్స్ 729 పాయింట్లు లాభపడింది. కాగా సెన్సెక్స్‌కు ఇది నెలన్నర గరిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.



నాలుగు రోజుల్లో 1,100 పాయింట్లు అప్...

స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం ఇది వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్. ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన గత మంగళవారం నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,169 పాయింట్లు లాభపడింది. సోమవారం సెన్సెక్స్ ఒక దశలో 26,822 పాయింట్ల గరిష్ట స్థాయిని(గురువారం నాటి ముగింపుతో పోల్చితే 601 పాయింట్లు లాభం) తాకింది.  త్వరలోనే సెన్సెక్స్ 27 వేల పాయింట్లను దాటేస్తుందని విశ్లేషకులంటున్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు బావుంటే 28 వేల పాయింట్ల మైలురాయిని కూడా అధిగమిస్తుందని వారంటున్నారు.  



టాప్‌లో టాటా మోటార్స్

అమెరికాలో టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్ అమ్మకాలు 61 శాతం పెరిగాయి. భారత్‌లో కంపెనీ వాణిజ్య, మధ్య, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు గత నెలలో 52 శాతం పెరిగాయి. వీటికి తోడు పీజియో కంపెనీ టాటా మోటార్స్‌తో కలిసి కార్లు తయారు చేయాలని యోచిస్తుందన్న వార్తలు, భారత వాహన రంగంలో టాప్ పిక్ టాటా మోటార్సేనని మాక్వెరీ మార్కీ పేర్కొనడం వంటి వార్తలతో  టాటా మోటార్స్ 6.1% లాభపడి రూ. 315 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. మారుతీ సుజుకీ 3.5%, లుపిన్ 1.1%, డాక్టర్ రెడ్డీస్ 1.1%, హిందూస్తాన్ యూనిలీవర్ 0.5% చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్ 5.8 శాతం, ఐసీఐసీ బ్యాంక్ 4.9%, హిందాల్కో 4.7%, హెచ్‌డీఎఫ్‌సీ 4.7%, లార్సెన్ అండ్ టుబ్రో 4.1 శాతం, హీరో మోటోకార్ప్ 4%, ఓఎన్‌జీసీ 3.4%, యాక్సిస్ బ్యాంక్ 3.3%, బజాజ్ ఆటో 3% చొప్పున పెరిగాయి. 2,001 షేర్లు లాభాల్లో, 787 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,036 కోట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ విభాగంలో రూ.18,698 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,79,876 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.650 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.366  కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు.



అసియా మార్కెట్లు 1.6 శాతం వరకూ లాభపడ్డాయి.  జాతీయ దినోత్సవం సందర్భంగా చైనా స్టాక్ మార్కెట్‌కు బుధవారం వరకూ సెలవు. యూరప్ మార్కెట్లు 2.12 శాతం నుంచి 3.35 శాతం లాభాల రేంజ్‌లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లో డోజోన్స్ 1.4%, నాస్‌డాక్ 1% లాభాల్లో ఉన్నాయి.

 

 

 ఇన్వెస్టర్ల సంపద  రూ.1.8 లక్షల కోట్లు ప్లస్

సెన్సెక్స్ జోరుగా పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.84 లక్షల కోట్లు పెరిగింది.  ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,84,665 కోట్లు పెరిగి రూ.98,39,357 కోట్లకు చేరింది.

 

లాభాల పరుగు ఎందుకంటే...

 ఉద్యోగాలు తగ్గాయ్... మార్కెట్లు పెరిగాయ్: గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో వచ్చే ఏడాదిలో గానీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవన్న అంచనాలతో అమెరికా, ఆసియా, యూరప్  మార్కెట్లు జోరుగా పెరిగాయి.

 

బేస్ రేట్ తగ్గింపు: గత వారంలో ఆశ్చర్యకరంగా ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పలు బ్యాంకులు బేస్‌రేట్‌ను తగ్గించసాగాయి. దీంతో రుణాలు చౌకగా లభిస్తాయనే అంచనాలతో రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు పుంజుకుంటున్నాయి.

 రూపాయి బలపడడం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పెరిగి 65.29కి చేరడం దేశీ స్టాక్‌మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది.



వృద్ధి ఓకే: 7.5 శాతం వృద్ధి సాధించడం కష్టమేమీ కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేయడం కలసివచ్చింది. మరిన్ని రేట్ల కోతలు ఉండే అవకాశాలున్నాయని, ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడానికి ప్రభుత్వ వ్యయంలో కోత విధించే అవకాశాల్లేవని...ఇవన్నీ వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆర్థిక   మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.



చైనా చర్యలు: వృద్ధి జోరు పెంచడానికి చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ లాభాలకు దోహదపడ్డాయి.  క్యూ2 ఫలితాలపై ఆశలు: అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గడం కంపెనీలకు ప్రయోజనకరమని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. వచ్చే వారం నుంచి క్యూ2 ఫలితాలు వెలువడనున్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top