కూలిన జర్మనీ విమానం

కూలిన జర్మనీ విమానం - Sakshi


స్పెయిన్ నుంచి జర్మనీ వెళుతున్న ఎయిర్‌బస్ ఎ320

మంచు పర్వతాల్లో ప్రమాదం.. అక్కడికి చేరుకోవటం చాలా కష్టం

ఘటనాస్థలానికి హెలికాప్టర్ల ద్వారానే సహాయ బృందాల రవాణా

{పమాదానికి కారణం తెలీదు.. ఎవరూ బతికే అవకాశం లేదు: ఫ్రాన్స్


 

ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం 150 మంది మృతి

 

పారిస్: ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. జర్మనీకి చెందిన విమానం ఆల్ప్స్ పర్వత శ్రేణిలో కూలిపోయింది. విమానంలోని 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిసహా మొత్తం 150 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 - 11:00 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. దట్టమైన మంచుతో నిండిన ఆల్ప్స్ పర్వతాల్లో కూలడంతో ప్రమాదం జరిగి కొన్ని గంటలు గడిచినా ఆ స్థలానికి సహాయక బృందాలేవీ చేరుకోలేక పోయాయి. ప్రమాద స్థలానికి ఫ్రాన్స్ హెలికాప్టర్‌ను పంపించగా.. లె ట్రోయిస్ ఎవెచెస్ అనే పర్వత శ్రేణిలో విమాన శకలాలను గుర్తించింది. ఆ పర్వతాలు సముద్రమట్టానికి 1,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ ప్రదేశానికి చేరుకోవటం చాలా కష్టమని, ఫ్రాన్స్ అధ్యక్షుడు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలన్నిటికీ తమ సానుభూతి తెలియజేశారు. జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడి.. ఆ దేశానికి సంఘీభావం తెలిపారు. ఫ్రాన్స్‌లో జర్మనీ విమానం కుప్పకూలటం అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీటర్‌లో విచారం వ్యక్తంచేశారు.

 

ఆపద సంకేతాలేవీ పంపలేదు...



ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ ఎ320 విమానం. 1990 నుంచి వినియోగంలో ఉంది. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు అనుబంధ సంస్థ అయిన జర్మన్‌వింగ్స్ నిర్వహిస్తున్న విమానమిది. స్పెయిన్ దేశంలోని తీర నగరం బార్సెలోనా నుంచి బయల్దేరిన ఈ విమానం జర్మన్ దేశంలోని డ్యుసెల్‌డార్ఫ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. మధ్యలో ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య గల బార్సెలోనెటె స్కీ రిసార్ట్ సమీపంలో కూలింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని.. ఉదయం 10:30 గంటలకు విమానం ప్రమాదంలో చిక్కుకుందని పౌర విమానయాన అధికారులు ప్రకటించారు. విమానం కూలిపోవటానికి ముందు అది ప్రయాణిస్తున్న ఎత్తు 8 నిమిషాల్లోనే 25 వేల అడుగులు పడిపో యిందని రాడార్  చెప్తోంది.



హెలికాప్టర్లలో వెళ్లడమే ఏకైక మార్గం...



ప్రమాద వార్త తెలిసిన వెంటనే సంక్షోభంపై మంత్రివర్గ బృందాన్ని ఫ్రాన్స్ ప్రధాని వాల్స్ సమావేశపరిచారు. భారీ సహాయ ప్రయత్నాలను ప్రారంభించామని.. కానీ విమానం కూలిన మారుమూల ప్రాంతాన్ని చేరుకోవటంలో పలు సవాళ్లు ఉంటాయని ఆయన తెలిపారు. మంచుతో నిండి ఉన్న ఆ ప్రాంతానికి భూమార్గంలో వాహనాలు చేరుకోవటం సాధ్యం కాదని.. అయితే హెలికాప్టర్లతో ఆకాశమార్గం ద్వారా చేరుకోవచ్చని అలాన్ పేర్కొన్నారు. అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెనూ తక్షణమే ప్రమాదస్థలానికి బయల్దేరారు. స్పెయిన్ పౌరులు పలువురు విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలియడంతో.. స్పెయిన్ రాజు ఆరవ ఫెలిపె తన ఫ్రాన్స్ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్నారు. ఫ్రాన్స్‌లో ప్రధానమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యూనియన్ బుధవారం నుంచి శుక్రవారం వరకు తలపెట్టిన సమ్మెను.. జర్మన్ విమాన ప్రమాదం నేపథ్యంలో విరమించుకుంది.



నాలుగు దశాబ్దాల్లో ఘోర ప్రమాదం...



నాలుగు దశాబ్దాల కాలంలో ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో ఇదే అతి ఘోరమైన విమాన ప్రమాదం. ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో 1974లో టర్కీ విమానం కూలిపోయిన దుర్ఘటనలో 346 మంది చనిపోయారు. ఆ తర్వాత 1981లో ప్రధాన భూభాగంపై కాకుండా.. కోర్సికా దీవిలో మరో విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని మొత్తం 180 మంది చనిపోయారు. కాగా, జర్మన్‌వింగ్స్ విమానయాన సంస్థ చరిత్రలో ఇప్పటివరకూ ఘోరమైన ప్రమాదమేదీ నమోదు కాలేదు. ప్రమాదానికి సంబంధించి తక్షణ వివరాలేవీ తెలియలేదని లుఫ్తాన్సా ప్రధాన అధికారి కార్‌స్టెన్ సోర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రమాదం జరిగిన విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్ దొరికిందని అధికారులు తెలిపారు.  

 

కారణాలు తెలియదు




విమానం కూలినపుడు భారీ శబ్దం వినిపించిందని.. ఆ సమయంలో ఆ ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ టెలివిజన్ చానల్‌తో చెప్పారు. ‘‘విమానం కూలిపోవడానికి కారణాలేమిటనేది మాకు తెలియదు. కూలిన పరిస్థితులను బట్టి విమానంలోని 150 మందీ చనిపోయినట్లు అక్కడికి వెళ్లిన సిబ్బంది నిర్ధారించారు’’ అని ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ మీడియాతో పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి, బాధిత కుటుంబాలకు సా యం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మరణించిన వారిలో 67 మంది జర్మన్‌లు, 45మంది స్పెయిన్ పౌరులు ఉన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top