భూకంపం రావొచ్చని నెలముందే తెలుసా?

భూకంపం రావొచ్చని నెలముందే తెలుసా? - Sakshi


నేపాల్‌ను అతలాకుతలం చేసిన పెను భూకంపానికి వారంరోజుల ముందే 50 మంది అంతర్జాతీయ భూకంపం అధ్యయన నిపుణులు కఠ్మాండులో సమావేశమై ప్రకృతి విలయం నుంచి ప్రజలను ఎలా రక్షించాలని చర్చించినా, పొంచి ఉన్న ప్రమాదం గురించి 'జియోహజార్డ్స్ ఇంటర్నేషనల్' సంస్థ నెల రోజుల ముందే హెచ్చరించినా, ఎందుకు నేపాల్ ప్రభుత్వం ప్రాణనష్టాన్ని అరికట్టలేకపోయింది?



 -భూమండలంపైనే అత్యంత ప్రమాదకర ప్రాంతంలో ఉన్న కఠ్మాండు వ్యాలీ నుంచి ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మినహా మరో మార్గమే లేదన్నది నిపుణుల సమాధానం. ఎందుకంటే భూకంపాలకు కారణమవుతున్న టెక్నోటిక్ ప్లేట్స్‌ పైనే నేపాల్ ఉంది. భూకంపాల కారణంగానే ఎవరెస్టు పర్వతాలు ఏర్పడిన విషయం తెల్సిందే.



 -భూకంపాల వల్ల ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికన్నా కఠ్మాండులో నివసిస్తున్న వ్యక్తికి 9 రెట్లు ప్రాణాపాయం ఎక్కువ. టోక్యోలో నివసిస్తున్న వ్యక్తికన్నా 60 రెట్లు ఎక్కువ. అసోంలోని కోబోలో చదువుకుంటున్న ఓ విద్యార్థి కన్నా కఠ్మాండులో చదువుకుంటున్న విద్యార్థికి ప్రాణాపాయం 400 రెట్లు ఎక్కువ. తాష్కంట్‌లో చదువుతున్న విద్యార్థుల కన్నా 30 రెట్లు ప్రాణాపాయం ఎక్కువ.



 -ఇంతటి తీవ్ర ముప్పు ఉన్నప్పుడు ప్రకంపనలు వస్తాయని తెలిస్తే ఎక్కడికెళ్లి తలదాచుకోవాలి? అంత పర్వతాలమయమైన కఠ్మాండుకు సమీపంలో మైదాన ప్రాంతాలేవీ లేవు. ఇళ్లు ఖాళీచేసి పర్వత ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడొచ్చని భావించవచ్చు. కానీ కొండ చెరియలు విరిగి పడడం వల్ల ప్రాణాలకు ముప్పురాదన్న గ్యారెంటీ లేదు.



 -పెను భూకంపం ముప్పు నుంచి కఠ్మాండు ప్రజలను రక్షించాలంటే మొత్తం ఊరును తరలించడం మినహా మరో మార్గం లేదని నేపాల్ ప్రభుత్వానికి అంతర్జాతీయ నిపుణులు తేల్చి చెప్పి వెళ్లారని వినికిడి. ఆ తర్వాత ప్రభుత్వం ఉన్నంతలో ప్రాణ నష్టాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నదన్నది ఇంక తెలియాల్సి ఉంది. ప్రభుత్వ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ప్రాణ నష్టం పెరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.



 -భూకంపాలను తట్టుకొని నిలబడే ఇళ్లను నిర్మించుకోవడమే భవిష్యత్తులో కఠ్మాండు ప్రజలకున్న పరిష్కార మార్గం. ఇళ్లు కూలిపోవడం వల్లనే కఠ్మాండులో ప్రాణ నష్టం జరిగిన విషయం తెల్సిందే. ప్రస్తుత భవన నిర్మాణ మార్గదర్శకాలకు భిన్నంగా నగరంలో 93 శాతం ఇళ్లు ఉన్నాయి. 1994లో తీసుకొచ్చిన ఈ నిర్మాణ మార్గదర్శకాలను 2003లో కేబినెట్ ఆమోదించాకే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికి కూడా కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారు ఈ మార్గర్శకాలను పాటించడం లేదు. ఖర్చు ఎక్కువవుతుందన్నది ప్రజల వాదన. వాస్తవానికి ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చులో గరిష్టంగా పది శాతానికి  మించి పెరగదు. ఇల్లు కట్టుకోవడం గగనమవుతున్న ఈ రోజుల్లో అంత ఖర్చుకూడా పెట్టలేమని వారు వాపోతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top