మన గీతకూ కావాలి.. ఒక బజరంగీ భాయ్‌జాన్!

మన గీతకూ కావాలి.. ఒక బజరంగీ భాయ్‌జాన్!


సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా బజరంగీ భాయ్‌జాన్ కథ కల్పితం.

కానీ ఇప్పుడు పాకిస్తాన్‌లో అలాంటి క థ నిజంగానే సాగుతోంది. 14 ఏళ్ల క్రితం రైలు ద్వారా పొరపాటుగా పాకిస్తాన్‌కు చేరిన ఓ బాలిక..

భారత్‌లోని తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఇంకా ఎదురుచూస్తోంది.

సినిమాలో మాదిరిగా ఆమెను పుట్టిన ఊరికి చేర్చేందుకు ఇప్పుడు నిజంగానే ఒక బజరంగీ భాయ్‌జాన్ అవసరం!




సినిమాలో మాదిరిగానే ఈమెకూ మాటలు రావు. వినపడదు. పాక్‌కు చేరిన ఈమెను తొలుత పంజాబ్ రేంజర్స్ సైనికులు గుర్తించి ఈదీ ఫౌండేషన్ చెంతకు చేర్చారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ భార్య, ‘మదర్ ఆఫ్ పాకిస్తాన్’ బిల్కిస్ ఈదీ ఈమెను హిందువుగా గుర్తించి.. ‘గీత’ అని పేరు పెట్టారు. ఫౌండేషన్ కార్యకర్తలు గీత తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రస్తుతం గీత వయసు 23 ఏళ్లు. కరాచీలోని ఈదీ ఫౌండేషన్ కేంద్రంలో ఉంటోంది. గీతకు ఒక ప్రార్థన గది, అందులో హిందూ దేవుళ్ల చిత్రపటాలు ఏర్పాటుచేశారు.



తన పుట్టిన ఊరు గురించి తెలిసిన కొన్ని విషయాలనూ గీత చెప్పలేకపోతోంది. సైగలు, హావభావాల ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. అచ్చం ఇలాంటి కథతోనే వచ్చిన బజరంగీ భాయ్‌జాన్  హిట్ అయిన నేపథ్యంలో అక్కడి సామాజిక కార్యకర్తలు గీత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాక్ మానవ హక్కుల కార్యకర్త, మాజీ మంత్రి అన్సార్ బర్నీ గీత కోసం ఫేస్‌బుక్ ప్రచారం ప్రారంభించారు.



గతేడాది భారత అధికారులు గీతను కలుసుకుని ఆమె ఫొటో, వివరాలను సేకరించినా ఆమె తల్లిదండ్రులెవరో తెలుసుకోలేకపోయారు. పాకిస్తాన్‌లోనే ఓ హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని గీత అక్కడే స్థిరపడాలని ఈదీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని గీత తెగేసి చెబుతోందట. ఏదేమైనా.. మన గీతకూ ఒక పాకిస్తాన్ బజరంగీ భాయ్‌జాన్ దొరకాలని.. ఈ నిజజీవిత కథ కూడా సుఖాంతమై.. ఆమె రాత మారాలని ఆశిద్దాం!

 

ఇవీ హింట్లు..

* భారత చిత్రపటాన్ని గీత గుర్తుపడుతోంది. కానీ ఓసారి జార్ఖండ్‌ను మరోసారి తెలంగాణను చూపిస్తోంది.

* తనకు ఏడుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్లు సైగల ద్వారా చెబుతోంది.

* పాకిస్తాన్‌కు పొరపాటుగా రైలులో వచ్చిన హిందూ బాలికగా గీతను గుర్తించారు.

* హిందీ భాషలో రాయగలుగుతోంది. కానీ ఆ పదాలతో ఆమె వివరాలు మాత్రం తెలియడం లేదు.

* గీత రాసే రాతల్లో తరచూ 193 సంఖ్య కనిపిస్తోంది. బహుశా అది ఆమె ఇంటి నంబర్ కావచ్చని అనుకుంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top