గీతా టీచర్ చాక్లెట్లను మరువలేను

గీతా టీచర్ చాక్లెట్లను మరువలేను


మా మంచి మాస్టారు

నేను మూడో తరగతి చదువుతుండగా గీతా టీచర్ రోజూ చాక్లెట్లు ఇచ్చేవారు. కల్టెకర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆమె పనిచేస్తున్న పాఠశాలకు వెళితే అప్పుడు కూడా చాక్లెట్లు ఇచ్చి ప్రేమను పంచారు. ఈ తీపి గుర్తులను ఎప్పటికీ మరువలేను. కాకినాడ గాంధీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో చదువుతుండగా తెలుగు మాస్టార్లు భాస్కర రామ్మూర్తి, చింతామణి చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నారుు. సైన్స్ మేడమ్ సావిత్రి, ఇంగ్లిష్ టీచర్ సత్యనారాయణ పాఠాలను ఎన్నటికీ మరువలేను. ఇంటర్ చదువుతుండగా లెక్చరర్ రాఘవరావు చదువులో ఎంతో ప్రోత్సహించారు. నేను కలెక్టర్ కావడానికి వీరందరూ కారకులు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఉపాధ్యాయులతో విద్యార్థి అనుబంధం జీవితాంతం ఉంటుంది.



జీవితంలో చిరస్థాయిగా ముద్ర వేసేది గురువు ఒక్కరే. గతంలో ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. ప్రస్తుతం సర్వశిక్షా అభియూన్ కారణంగా పాఠశాలలకు వసతులు, సదుపాయూలు కల్పిస్తున్నారు. వీటిని ఉపయోగించుకుని ప్రభుత్వ బడుల్లో చక్కగా చదువుకోవచ్చు. ఉపాధ్యాయులూ వసతులను అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అందిస్తే ఎందరో కలెక్టర్లు, ఎస్పీలు సర్కారీ బడుల్లో నుంచే వస్తారు.     

  - కలెక్టర్ కె.భాస్కర్



సిస్టర్ జఫ్రిన్ నాకు ఆదర్శం

 చదువంటే అక్షరాస్యతే. జ్ఞానమే అసలైన చదువు. నేడు గురువులను విద్యార్థులు చులకనగా చూస్తున్నారు. ఇది మారాలి. గురువును దైవంగా భావించాలి. నేను విజయవాడ అటికిన్స్ బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు సిస్టర్ జఫ్రిన్ ఆదర్శంగా ఉండేవారు. ఆమె పిల్లలపై చూపించే ప్రేమ, కరుణ నన్నెంతో ఆకట్టుకున్నారుు. చిన్నప్పుడే నాలో నాయకత్వ లక్షణాలు గుర్తించి గురువులు ప్రోత్సహించారు. కళాశాల స్థాయిలో సిస్టర్ స్టెల్లా, డిగ్రీ కళాశాలలో సిస్టర్ డాక్టర్ బీనీ, లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీబీ కుమార్, కాంపిటేషన్ పరీక్ష శిక్షణలో కరీం సార్  నా ఉన్నతికి భాగస్వాములయ్యూరు. నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు.

 - కేజీవీ సరిత, ఏలూరు డీఎస్పీ

 

 విక్టర్ సార్ ఇంటికొచ్చి మరీ తీసుకువెళ్లేవారు

 నేను ఎలిమెంటరీ స్కూల్‌కు వెళ్లే రోజుల్లో పొలాల వెంట తిరుగుతుంటే మా మాస్టారు జార్జి విక్టర్ వెంటాడి మరీ నన్ను పట్టుకుని బడికి తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి స్కూల్‌కి వెళ్లకపోతే ఇంటికి వచ్చి మరీ తీసుకువెళ్లేవారు. చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చేవారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేసే జార్టి విక్టర్ మాస్టారులాంటి ఉపాధ్యాయులు ఇప్పుడూ కావాలి. హైస్కూల్ స్థాయిలో తెలుగు మాస్టారు వాసుదేవశాస్త్రి అభినయంతో బోధించే విధానం బాగుండేది. బ్రహ్మచారిగా మిగిలిన ఆయన తన ఇంటి వద్దే పిల్లలను ఉంచి చదివించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధ్యాయులు మేల్కొనాలి, సర్కారీ విద్యను కాపాడుకోవాలి. గురువులు స్ఫూర్తినిస్తూ విద్యార్థులకు నైతికతతో కూడిన విద్యను అందించాలి.

 - డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి

 

 బయోలజీ మేడమ్ స్ఫూర్తితోనే..

 విజయనగరం జిల్లాలో నేను డిగ్రీ చదువుతుండగా మైక్రో బయోలజీ చెప్పడానికి షర్మిలాబేగం అనే లెక్చరర్ వచ్చేవారు. కేవలం ఆమె పాఠాలు చెప్పి ఊరుకునేవారు కాదు. ఉన్నత లక్ష్యాలను ఎలా ఏర్పరుచుకోవాలి, వాటిని చేరుకోవడానికి ఎలా పరిశ్రమించాలి అనే విషయూలు చెప్పేవారు. ఆమే నాకు స్ఫూర్తి. నేను గ్రూప్స్‌కు సెలెక్ట్‌కాక ముందు విశాఖలో మూడేళ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేశా. నేను ఈ రోజు డీఎస్పీ కావడానికి షర్మిల మేడమ్ కారణం.  

 -పి.సౌమ్యలత, డీఎస్పీ, నరసాపురం

 

 గురువుల దయతోనే ఈ స్థాయికి

గురువుల దయతోనే జిల్లా ఎస్పీ స్థారుుకి ఎదిగాను. నన్ను ప్రభావితం చేసిన వారిలో మొదటి స్థానం అమ్మ మంజు మల్లిక్, నాన్న లక్ష్మీకాంత మల్లిక్‌కు దక్కుతుంది. పాఠశాల స్థాయిలో ఉండగా కన్నబిడ్డలా భావించి రాంచీలోని పాఠశాలలో అక్షరాలు దిద్దించిన మెనెన్ మేడం, హైస్కూల్‌లో మ్యాథ్స్ నేర్పించిన సుకుమార్ సార్, రామకృష్ణమఠంలో స్వామి శ్రద్ధానందజీ మహరాజ్, ఐఐటీలో పాల్ సార్, మిశ్రా సార్, దామోదర్ సార్‌ను ఎన్నటికీ మరిచిపోలేను. నన్ను వారెంతగానో ప్రభావితం చేశారు. అడుగడుగునా ప్రోత్సహిస్తూ మార్గదర్శకులుగా నిలిచారు. వృత్తిపరంగా రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ రాముడు, ఏలూరు డీఐజీ హరికుమార్, అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు, సీఐడీ ఏడీజీ ద్వారకాతిరుమలరావును గురువులుగా భావిస్తున్నా. గురు పూజోత్సవం సందర్భంగా వీరందరినీ స్మరించుకోవడం ఆనందంగా ఉంది.  

 - భాస్కర భూషణ్, జిల్లా ఎస్పీ

 

 గురువే మార్గనిర్దేశకుడు

 ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర కీలకంగా ఉంటుంది. గురువులే మన మార్గనిర్దేశకులు. తల్లితండ్రుల తర్వాత ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చాం. నిజానికి పిల్లల విషయంలో తల్లితండ్రులతో సమానమైన బాధ్యతను గురువు నిర్వర్తింటారు. నా చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. నేను ఈ స్థితికి రావడానికి చాలామంది ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంది. ప్రతి ఒక్కరూ గురువును పూజించాలి. గురువు సూచించిన మార్గంలో నడవాలి.

 - డి.పుష్పమణి, ఆర్డీవో, నరసాపురం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top