ఒకే చానల్... జిల్లాకో ప్రసారం!

ఒకే చానల్... జిల్లాకో ప్రసారం! - Sakshi


న్యూస్ చానళ్లలోనూ ప్రాంతీయ, జోనళ్ల వారీగా ప్రసారాలు, ప్రకటనలు

  ‘మాయా ప్లాట్‌ఫామ్’తో సాధ్యం చేస్తున్న గయాన్ సొల్యూషన్స్

 చానళ్లను రోజువారీ అద్దెకిచ్చే సేవలు నెలరోజుల్లో ఆరంభం


 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో

 న్యూస్ పేపర్ చూడండి. పేపర్ ఒకటే అయినా ప్రతి రాష్ట్రానికీ వార్తలు, అడ్వర్టయిజ్‌మెంట్లు మారిపోతుంటాయి. ఇక ప్రాంతీయ పత్రికలైతే జిల్లా జిల్లాకూ వార్తలు, ప్రకటనలు మారిపోతాయి. ‘సాక్షి’ లాంటి ప్రధాన పత్రికలైతే ఇంకా ముందుకెళ్లి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కూడా జోన్‌పేజీలు అందిస్తున్నాయి. అదే పత్రికల బలం.

 

 మరి టెలివిజన్ చానళ్ల సంగతో!! జాతీయ ఛానెళ్లయినా, ప్రాంతీయ చానళ్లయినా అంతటా ఒకటే ప్రసారాలు. ఎలాంటి తేడా ఉండదు. అదే చానళ్ల బలహీనత. పత్రికలు ఒకేరోజు మొదటి పేజీలో ప్రాంతాల వారీగా జిల్లాకో ప్రకటన ఇవ్వగలవు. దాంతో వాటికి ప్రకటనలే కాక ఆదాయమూ ఎక్కువగానే వస్తుంది. టీవీలకు ఈ సౌలభ్యం లేకే అవి పత్రికలతో పోటీపడే స్థాయికి రాలేకపోతున్నాయన్నది విశ్లేషకుల మాట.



 ఇదిగో... ఈ లోటు పూడ్చి చానళ్లకూ ఆ అవకాశాన్నిచ్చే సేవలందిస్తోంది గయాన్ సొల్యూషన్స్. నిజానికి గతంలోనూ రెండుమూడు కంపెనీలు ఈ ప్రయోగం చేశాయి. కానీ అవి మెట్రోపాలిటన్ నగరాల్ని విభజించటమో, లేక పెద్ద పెద్ద ఎంఎస్‌ఓలను హెడ్స్‌గా తీసుకుని విభజించటమో చేశాయి. అవి కూడా ప్రకటనల వరకే పరిమితమయ్యాయి. కానీ, గయాన్ సొల్యూషన్స్ ‘మాయా ప్లాట్‌ఫామ్’ పేరిట రూపొందించిన టెక్నాలజీతో ప్రాంతీయ, జోనళ్ల వారీగా ప్రసారాలను, ప్రకటనలను కూడా కేంద్ర కార్యాలయం నుంచే పంపిణీ చేయొచ్చంటున్నారు సంస్థ సీఈఓ చంద్రా ఎస్ కొటారు.

 

 ఈ స్టార్టప్ వివరాలు ఆయన మాటల్లోనే...

 న్యూస్ చానళ్లకు ప్రాంతీయ పంపిణీ లేకపోవటం వల్ల స్థానిక ప్రకటనలు టీవీలకు రావటం లేదు. మాయా ప్లాట్‌ఫామ్‌తో ఆ లోటును భర్తీ చేయడమే కాక వార్తలనూ స్థానికంగా ప్రసారం చేసే వీలు కలుగుతుంది. కొన్ని చోట్ల ప్రసారాంశాలను మార్చటం, ప్రసార సమయాన్ని కొన్ని చోట్ల వాయిదా వేయటం, ఏకకాలంలో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం, ప్రకటనలు ప్రసారం చేయటం... ఇవన్నీ మాయా ప్లాట్‌ఫామ్‌తో సాధ్యమే. స్థానిక సమాచారాన్ని సమర్థంగా, విస్తృతంగా అందించేందుకు ఇది తిరుగులేని ప్లాట్‌ఫామ్. దాదాపు రూ.30 కోట్ల పెట్టుబడితో ఆరేళ్ల కిందట గయాన్ సొల్యూషన్స్ ఇండియాను స్థాపించాం.

 

 రూ.కోటిన్నర పెడితే చాలు

 మాయా ప్లాట్‌ఫామ్ సేవల్ని వినియోగించుకోవాలంటే రెండు రకాలున్నాయి. ఒకటి... ప్రకటనల విలువలో 15 శాతం సొమ్మును కంపెనీకి చెల్లించటం. రెండు... ఏకమొత్తంగా రూ.కోటిన్నర పెట్టి మాయా ప్లాట్‌ఫామ్‌ను కొనుక్కోవటం. ఇలా కొనుక్కున్న వారు కేంద్ర కార్యాలయం నుంచే ప్రసారాలను, ప్రకటనలను ప్రాంతాల వారీగా పంపిణీ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం 9 ఎక్స్, ఏబీపీ, మున్సిఫ్, ఇండియన్ న్యూస్, 10 టీవీ మీడియాలు ఈ మాయా ఫ్లాట్‌ఫామ్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఈటీవీ, టైమ్స్, జీ టీవీతో చర్చలు జరుగుతున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఆల్ ఇండియా రేడి యోలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమౌతోంది. దీన్ని మాయా ద్వారా అన్ని ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో అందించేందుకు అనుమతి కోసం పీఎంఓతో మాట్లాడుతున్నాం.

 

 అద్దెకు చానల్...

 పుట్టిన రోజు, పెళ్లి రోజని స్థానిక పేజీల్లో ప్రకటనలు చూస్తాం. వాటి వీడియో ప్రసారాలను కూడా చేయటానికి వీలుగా... కారును అద్దెకు తీసుకున్నట్లే న్యూస్ చానల్‌నూ అద్దెకు తీసుకునే సరికొత్త సేవల్ని ప్రారంభిస్తున్నాం. రెంట్ ఏ కేబుల్.ఇన్ సేవలను ఢిల్లీలో ప్రారంభించాం. స్పందన బాగుంది. నెలరోజుల్లో హైదరాబాద్‌లోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాం. గయాన్ టీవీ బ్రాండ్‌తో ఒకో ఆపరేటర్ దగ్గర 20 చానళ్లు అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి సంఖ్యను పెంచుతాం. ఇందుకు ఒక రోజుకు అద్దెగా రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

 

 

 10 మిలియన్ డాలర్ల టర్నోవర్...

 గయాన్ సొల్యూషన్స్ ఇండియాకు ఏటా రూ.60 కోట్ల టర్నోవర్ ఉంది. మాయా ప్లాట్‌ఫామ్‌ను రూపొందించేందుకు రెండేళ్లు పట్టింది. సుమారు 100 మంది ఇంజనీర్లు భాగస్వాములయ్యారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో మొత్తం 14 పేటెంట్లు తీసుకున్నాం.

 

 అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top