ఉగ్రవాదుల డ్రోన్లపై గద్దలతో దాడి!

ఉగ్రవాదుల డ్రోన్లపై గద్దలతో దాడి!

ఉగ్రవాదులు డ్రోన్లు తయారుచేసి, వాటితో దాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నితే.. ఆ కుట్రను భగ్నం చేయడానికి ఫ్రెంచి సైన్యం వారికి దీటుగా స్పందించింది. నాలుగు గద్దలను పెంచి.. వాటికి డ్రోన్లను ధ్వంసం చేయడంలో శిక్షణ ఇచ్చింది. పెరిగి పెద్దవైన ఆ నాలుగు గద్దలు వాటి విధులను బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాయి. డి అర్టగ్నాన్, అథోస్, పోర్థోస్, అరామిస్ అని పేరున్న ఈ నాలుగు.. డ్రోన్లను వెంటాడి, వేటాడి మరీ నాశనం చేస్తున్నాయి. అలా నాశనం చేసిన వెంటనే వాటికి బ్రహ్మాండంగా మాంసంతో విందుభోజనాలు వడ్డించారు. మిలటరీ కంట్రోల్ టవర్ సమీపం నుంచి ఈ గద్దలు తమ ఆపరేషన్లను కొనసాగిస్తున్నట్లు ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. 

 

20 సెకండ్లలో 200 మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న గద్దలు.. డ్రోన్‌ను గుర్తించగానే దానిమీద పడి నాశనం చేసి వచ్చేస్తున్నాయి. గద్దలు చాలా బాగా పనిచేస్తున్నాయని, వాటితో మంచి ఫలితాలు వస్తున్నాయని ఫ్రెంచి వైమానిక దళం కమాండర్ ఒకరు తెలిపారు. కొన్ని వారాల క్రితం ఇరాకీ సైనికులు ఒక డ్రోన్‌ను గమనించి.. అది బాంబు జారవిడుస్తోందని తెలిసి దానిమీద విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. రేడియో నియంత్రిత గూఢచారులుగా వ్యవహరించే డ్రోన్లను ఉగ్రవాదులు అభివృద్ధి చేయించి, వాటితో సైన్యం మీద దాడులు మొదలుపెడుతున్నారు. ఈ తరహా దాడులను అడ్డుకోడానికి గద్దలైతేనే సరైన మార్గమని భావించిన ఫ్రాన్స్.. ఆ దిశగా ప్రయత్నించి సఫలమైంది. ఈ గద్దలలో మూడింటికి 'త్రీ మస్కిటీర్స్'లో పాత్రల పేర్లు పెట్టారు. త్వరలోనే మరిన్ని గద్దలకు ఇలా శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తామని చెబుతున్నారు. అలాగే గద్దలకు రక్షణగా ఉండేందుకు, అవి బాంబు పేలుడుతో గాయపడకుండా చూసేందుకు కావల్సిన పరికరాలు కూడా వాటికి అమరుస్తున్నట్లు చెప్పారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top