అబ్దుల్ కలాం కన్నుమూత

అబ్దుల్ కలాం కన్నుమూత - Sakshi


ఐఐఎం షిల్లాంగ్‌లో తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిన మాజీ రాష్ట్రపతి  

 ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే తుదిశ్వాస

 ‘లివబుల్ ప్లానెట్’పై ప్రసంగించేందుకు ఐఐఎంకు వెళ్లిన కలాం

 మిస్సైల్ మ్యాన్‌గా, ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఘనత

 ప్రజా రాష్ట్రపతిగా, యువ హృదయాలకు స్పూర్తిప్రదాతగా మన్నన

 కలాం మృతి వ్యక్తిగత లోటన్న రాష్ట్రపతి

 మార్గదర్శకుడిని కోల్పోయానన్న ప్రధాని

 నేడు ఢిల్లీకి పార్థివదేహం

 రామేశ్వరంలోనే అంత్యక్రియలు జరపాలని బంధువుల విజ్ఞప్తి

 

 షిల్లాంగ్(మేఘాలయ): భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త, యువ హృదయాల స్ఫూర్తి ప్రదాత ఏపీజే అబ్దుల్ కలాం(83) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్ర గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆయనను హుటాహుటిన నాన్‌గ్రిమ్ హిల్స్‌లోని బెతానీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. స్థానిక ఆర్మీ ఆసుపత్రి, ఇందిరాగాంధీ ఈశాన్య వైద్య విజ్ఞాన సంస్థ నుంచి డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందించారు. కలాంను ఆసుపత్రిలో చేర్చిన వార్త వినగానే మేఘాలయ గవర్నర్ షన్ముఖనాథన్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం, అబ్దుల్ కలాం సాయంత్రం 7.45 గంటలకు తుదిశ్వాస విడిచారని షన్ముఖనాథన్ ప్రకటించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయనను కాపాడలేక పోయారన్నారు. కలాం పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం ఢిల్లీకి తరలించనున్నారు. అప్పటివరకు మిలటరీ ఆసుపత్రిలో భద్రపరుస్తారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహాన్ని గువాహటి వరకు, అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు జులై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జాతీయ సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది తర్వాత తెలియజేస్తామంది. ఈ వారం రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. పార్టీలకతీతంగా అనేకమంది ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం తెలిపేందుకు మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

 

 సాధారణ స్థాయి నుంచి: అతి సాధారణ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం తండ్రి జైనులబ్దీన్ చిన్న పడవకు యజమాని. తల్లి అశియమ్మ గృహిణి. కలాం మద్రాస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివారు. భారతీయ క్షిపణి వ్యవస్థకు ఊపిరులూది ‘మిస్సైల్ మ్యాన్’గా పేరుగాంచారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన అగ్ని, పృథ్వి తదితర క్షిపణులు ఆయన మార్గనిర్దేశకత్వంలో రూపొందినవే. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల వెనుక కీలక శక్తి అయిన కలాం.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. 1997లో ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి లక్ష్మి సెహగల్‌పై భారీ మెజారిటీతో గెలిచి, 2002 నుంచి 2007 వరకు దేశ 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం విశేష సేవలందించారు. ప్రత్యక్ష రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రాష్ట్రపతి కావడం అదే ప్రథమం. సుఖోయి యుద్ధ విమానాన్ని నడిపిన, జలాంతర్గామిలో ప్రయాణించిన, సియాచిన్‌ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆయన ప్రఖ్యాతి గాంచారు.

 

 టీచర్‌గా.. రైటర్‌గా: రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగిన అనంతరం కలాం తనకిష్టమైన బోధన రంగంలో కొనసాగారు. ఐఐఎం షిల్లాంగ్, అహ్మదాబాద్, ఇండోర్‌లకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీలో ఐటీ బోధించారు. అలాగే, తనకిష్టమైన మరో ప్రవృత్తి రచనావ్యాసంగం కొనసాగించారు. ఎందరో ప్రముఖుల మన్ననలు పొందిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ కలాం ఆత్మకథాత్మక రచన. ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన అబ్దుల్ కలాంకు చిన్నారులంటే ఎంతో అభిమానం. వారితో సమయం గడిపేందుకు ఆయన ఎంతో ఇష్టపడేవారు. వారిలో విజయకాంక్షను నింపేందుకు ప్రయత్నించేవారు. వేలాది యువ హృదయాల్లో స్ఫూర్తిని.. మస్తిష్కాల్లో జిజ్ఞాసను రగిల్చారు.

 

 



 


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అబ్దుల్ కలాం(ఫైల్)


 


చిన్నబోయిన రామేశ్వరం..




కలాం మృతి వార్తతో ఆయన స్వస్థలం తమిళనాడులోని చిన్న ద్వీప పట్టణం రామేశ్వరం చిన్నబోయింది. భారీ సంఖ్యలో బంధువులు, అభిమానులు ఆయన స్వగృహానికి చేరుకుని, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. కలాం పెద్దన్న 99 ఏళ్ల మొహమ్మద్ ముత్తుమీర లెబ్బై మరైకర్ శోక సంద్రంలో మునిగిపోయారు. తన తమ్ముడి ముఖాన్ని ఒక్కసారైనా చూపించండంటూ కన్నీటితో వేడుకుంటున్నాడని ఆయన కుమారుడు జైనులబ్దీన్ తెలిపారు. కలాం అంత్యక్రియలను రామేశ్వరంలో జరిపే అవకాశాలపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. కలాం మనవడు సలీం సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ తన తాతయ్య భౌతిక కాయాన్ని రామేశ్వరం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన భౌతిక కాయానికి స్వస్థలం రామేశ్వరంలోనే అంత్యక్రియలు చేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

 

 షిల్లాంగ్‌లో  చివరి క్షణాలు

 

 సాయంత్రం 5.40 గంటలకు - షిల్లాంగ్ చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

 6.35 - ‘లివబుల్ ప్లానెట్’ అంశంపై ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారు.

 6.40 - తీవ్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు.

 7.00 - 1 కిమీ దూరంలో ఉన్న బెతానీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

 7-45 - తుది శ్వాస విడిచారు (అని గవర్నర్ షన్ముఖనాథన్ ప్రకటించారు)



 ‘లివబుల్ ప్లానెట్’ అంశంపై ప్రసంగించేందుకు ఐఐఎం షిల్లాంగ్ వెళ్తున్నా’ అంటూ కలాం చివరి ట్వీట్ చేశారు. గుండెపోటుతో కలాం చనిపోయారని ఆసుపత్రి అధికారులు తనకు చెప్పారని ఐఐఎం షిల్లాంగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ డే తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే కలాంలో జీవ స్పందనలేవీ కనిపించలేదని ఆయనకు వైద్యసేవలందించిన డాక్టర్ ఖర్బమాన్ వెల్లడించారు. అప్పటికే  శ్వాస తీసుకోవడంలేదని, నాడి స్పందనలు ఆగిపోయాయని, రక్తపోటు శూన్యమైందని, కనుగుడ్లు పెద్దవయ్యాయని ఆయన వివరించారు. అయితే, ఆ లక్షణాలతో వెంటనే మరణించినట్లుగా ప్రకటించలేమని స్పష్టం చేశారు.



సోమవారం రాత్రి కలాంను ఉంచిన షిల్లాంగ్ లోని బెథానీ ఆస్పత్రి ఆవరణలో విషణ్నవదనంతో స్థానికులు

 

 చివరి క్షణం వరకూ స్ఫూర్తి పంచుతూనే..!

 ‘షిల్లాంగ్ వెళ్తున్నాను... అక్కడి ఐఐఎమ్‌లో ‘లివబుల్ ప్లానెట్ ఎర్త్’ అంశం గురించి మాట్లాడబోతున్నా...’

 - ఇదీ కలాం చివరి ట్వీట్. సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఆయన ఈ ట్వీట్ చేశారు.

 

 కలాంకు ప్రముఖుల సంతాపం

 కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే దార్శనికుడు కలాం

 - ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ

 ఆయన పూడ్చలేని ఖాళీని వదిలి వెళ్లారు

  - కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

 రక్షణ శాస్త్రవేత్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయారు ఆయన లేని లోటు తీరనిది.

 -జి.సతీశ్ రెడ్డి, రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ), రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు

 దేశం ఒక మేధావిని కోల్పోయింది

 - సంగీత దర్శకుడు ఏఆర్ రెహ మాన్

 కలాం గొప్ప మానవతావాది కూడా

 - బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్

 

 రాష్ట్ర నేతల సంతాపం




 రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా కలాం సేవలు మరవలేనివంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top