ప్రముఖ దర్శకుడిపై గృహహింస కేసు!

ప్రముఖ దర్శకుడిపై గృహహింస కేసు!


విమర్శల ప్రశంసలందుకున్న ప్రముఖ చిత్ర దర్శకుడు సిద్ధార్థ శ్రీనివాసన్‌ గృహహింస కేసు ఎదుర్కొంటున్నారు. సాండ్స్‌ ఆఫ్‌ సోల్స్‌ (పైరన్‌ తల్లె) సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న శ్రీనివాసన్‌పై ఆయన భార్య దివ్యా భరద్వాజన్‌ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తన తల్లిగారింటికి వెళ్లివచ్చిన తర్వాత తిరిగి ఇంట్లోకి రాకుండా తనను శ్రీనివాసన్‌ అడ్డుకుంటున్నారని, తన భర్త, అత్త మామ వేధిస్తున్నారని ఆమె కోర్టుకు నివేదించారు. తాను ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించాలని, తనకు భరణం చెల్లించాలని ఆమె అభ్యర్థించారు. అయితే, కోర్టు ఆమె అభ్యర్థనను కొంతమేరకు మాత్రమే అంగీకరించింది. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలో ఉన్న శ్రీనివాసన్‌ ఇంట్లోకి భార్యను అనుమతించాలని, ఆమెకు అటాచెడ్‌ టాయ్‌లెట్‌తో కూడిన ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించింది.



ప్రాథమిక ఆధారాలను బట్టి దివ్య గృహ హింస ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నదని, ఇలాంటి పరిస్థితిలో సొంతిల్లు లేని ఆమెకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నామని, కాబట్టి భర్త ఇంట్లో ఆమె భాగం కింద గది కేటాయించాలని ఆదేశిస్తున్నామని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2013లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త శ్రీనివాసన్‌, ఆయన తల్లి అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయారని, దీంతో తనకు గత్యంతరం లేన తన తల్లి ఇంటికి వెళ్లానని, కాగా, ఇప్పుడు తాను తిరిగిరాగా, తన భర్త మకాం మార్చడమే కాదు.. కొత్తింట్లోకి తాను రాకుండా అడ్డుకున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. విడాకులు ఇవ్వాలని తనను ఆయన బలవంతపెడుతున్నారని చెప్పారు.



అయితే, ఆమెపై క్రూరంగా వ్యవహరించామన్న ఆరోపణలను శ్రీనివాసన్‌ తోసిపుచ్చారు. ఆమెను ఇంటి నుంచి గెంటివేయలేదని శ్రీనివాసన్‌ లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటే మున్ముందు వివాదం మరింత పెరిగిపోవచ్చునని లాయర్‌ వాదించగా.. ఆ వాదనను కోర్టు కొట్టిపారేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top