మౌనం వీడిన ఫిడెల్ కాస్ట్రో

మౌనం వీడిన ఫిడెల్ కాస్ట్రో


హవానా: అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం పట్ల  క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మొట్టమొదటి సారిగా మౌనం వీడారు. అసలు తాను అమెరికా విధానాలను విశ్వసించనని, ఈ విషయంలో అమెరికన్లతో తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. అయితే  దానర్థం అమెరికాతో క్యూబాకున్న సైనిక సంఘర్షణలను శాంతియుత మార్గాల ద్వారా  పరిష్కరించుకోవాలనే ఉద్దేశం తనకు లేనట్లు భావించరాదని దేశ విద్యార్థులనుద్దేశించి రాసిన ఓ లేఖలో ఆయన వ్యాఖ్యానించారు.



శాంతిని పరిరక్షించడం అందరి బాధ్యతగా తాము భావిస్తామని, ప్రపంచ ప్రజలందరితో తాము స్నేహాన్ని కోరుకుంటామని, ప్రత్యర్థి దేశాల నేతలతో కూడా తాము స్నేహాన్నే వాంఛిస్తున్నామని  88 ఏళ్ల కాస్ట్రో స్పష్టం చేశారు. ప్రపంచంలో క్యూబాను ఒంటరిని చేసేందుకు అణుక్షణం కుట్రలు పన్నుతూ వచ్చిన అమెరికాను తన పదవిలో ఉన్నంతకాలం గడగడలాంటించిన కాస్ట్రో, అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటోన్న విషయం తెల్సిందే.



క్యూబోతో సంబంధాల్లో తాము కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నామని గత నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బహిరంగంగా చేసిన ప్రకటనకు స్పందిస్తూ కాస్ట్రో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠాన్ని క్యూబా జాతీయ పత్రిక ‘లా గ్రాన్మా’ ప్రచురించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top