ఓ తండ్రి తీర్పు!

ప్రేమోన్మాది రాజును వేటకొడవలితో హతమార్చిన యువతి తండ్రి వల్లభరావు - Sakshi


కూతురిపై దాడికి తెగబడ్డ ఉన్మాదిని నరికి చంపిన నాన్న

 


సాక్షి, హైదరాబాద్: శుక్రవారం.. వేకువజాము.. వేట కొడవలితో ఓ ఉన్మాది.. తనకు దక్కని యువతిని చంపుదామని బయల్దేరాడు.. ఇంట్లోకి చొరబడ్డాడు.. నిద్రపోతున్న యువతిని లేపాడు.. కొడవలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.. అడ్డొచ్చిన తల్లి, సోదరుడిపైనా దాడికి తెగబడ్డాడు.. అరుపులు, కేకలు విన్న యువతి తండ్రి అక్కడికి రావడంతో ఆయనపైనా ఆయుధంతో చెలరేగిపోయాడు! తీవ్రంగా ప్రతిఘటించిన తండ్రి.. అదే వేట కొడవలితో ఉన్మాదిని చంపేశాడు!! ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తనను, తన వారిని కాపాడుకునేందుకే ఉన్మాదిని చంపాల్సి వచ్చి ందని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది.

 

 ఏం జరిగిందంటే..


తూర్పుగోదావరి జిల్లా ఎర్రపాలెం గ్రామానికి చెందిన వల్లభరావు (67) కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆవులను పోషిస్తూ కుటుంబం వెళ్లదీస్తున్నారు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమార్తె నీరజ కృష్ణవేణి.. కేపీహెచ్‌బీ కాలనీలోని ఇంటీరియర్ డెకరేషన్ షాపులో పని చేస్తోంది. చేవెళ్లకు చెందిన రాజు (25) అలియాస్ మల్లేశ్ ప్రశాంత్‌నగర్‌లోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నీరజ పని చేస్తున్న కాంప్లెక్స్‌లో గతంలో ఇతడు ఓ మొబైల్ షాపులో పనిచేశాడు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ నీరజ వెంటపడుతున్నాడు. సంవత్సరం కిందట యువతి ఇంటికే వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడాడు. నీరజను ప్రేమించానని, తనకిచ్చి పెళ్లి చేయాలన్నాడు. అయితే వల్లభరావు తన కూతురు వెంటపడొద్దని గట్టిగా చెప్పి పంపించేశాడు. దీంతో అతడు నీరజపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని ప్రేమను మరో వ్యక్తికి దక్కనివ్వొద్దన్న ఉద్దేశంతో నీరజను చంపేందుకు కుట్ర పన్నాడు.

 

 శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు వేటకొడవలితో నీరజ ఇంట్లోకి చొరబడి ఆమె మెడ, చేతి భాగాలపై పాశవికంగా దాడి చేశాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తల్లి తులసమ్మ, నీరజకు వరుసకు సోదరుడైన దుర్గా గంగాధర్‌లు రాజును అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వారిపైనా రాజు దాడి చేశాడు. తులసమ్మ మనవరాలు రత్నకుమారి భయంతో మంచం కింద దాక్కుంది. అప్పుడే నీళ్లు తెచ్చేందుకు బయటకు వెళ్లిన తండ్రి వల్లభరావు.. ఇంట్లోంచి అరుపులు, కేకలు వినిపించడంతో పరుగుపరుగున వచ్చారు. తలుపులు నెట్టి చూడగా కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్ర ఆగ్రహంతో ప్రతిఘటించబోగా.. రాజు ఆయనపైనా దాడికి దిగాడు. చివరికి రాజు తీసుకువచ్చిన కొడవలినే వల్లభరావు తన చేతిలోకి తీసుకున్నాడు. దానితో రాజును అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి, సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడినా.. నీరజ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

 

 నా వాళ్లను  కాపాడుకునేందుకే చంపా


తనను, తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకే ఉన్మాదిని హతమార్చినట్లు నీరజ తండ్రి పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసుల వాంగ్మూలంలో చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.    

 

 ఇది సామాజిక విషాదం

 మగాడిగా నిరూపించుకోవాలనుకోవడం, తిరస్కారాన్ని స్వీకరించలేకపోవడం వంటి ఆధిపత్య దృక్పథాల్లో మార్పు రానంతకాలం ఇలాంటి సామాజిక విషాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి.  స్త్రీ, పురుష సమానత, నైతిక విలువలపై క్యాంపెయిన్ చేపట్టాలి. ఇటీవల కాలంలో జరుగుతున్న పరువు హత్యలు కూడా శతాబ్దాలుగా పట్టిపీడిస్తున్న దృక్పథాల దుష్ఫలితమే.

 - దేవి, సామాజిక కార్యకర్త

 

 

మా రాజు సౌమ్యుడు

రాజు సౌమ్యుడని, అమ్మాయిపై దాడి చేసేంత ధైర్యం లేదని అతడి సోదరుడు నర్సింగ్ చెప్పారు. రాజు సెల్‌ఫోన్‌లో ఫొటోలు, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు జరిపితే నిజాలు వెల్లడవుతాయన్నారు. గాంధీలో పోస్టుమార్టం అనంతరం రాజు మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

 

పురుషుల్లో మార్పు రావాలి


ఒకరిద్దరిని కఠినంగా శిక్షించినంత మాత్రాన ప్రేమోన్మాదుల దుర్మార్గాలు ఆగబోవు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. స్త్రీలను సొంత ఆస్తిగా చూసే పురుషాధిపత్య ధోరణిలో మార్పు రానం త కాలం ఇలాంటి దాడులు కొనసాగుతూ నే ఉంటాయి. పరస్పర నమ్మకం, గౌర వం, ఒకరి పట్ల ఒకరికి సంపూర్ణమైన అవగాహనతోనే ప్రేమ భావన ఏర్పడాలి. కానీ స్త్రీని ఒక ఆస్తిగా భావించి, నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనుకోవడం దుర్మార్గం. స్త్రీ అభిప్రాయాలను,  ఇష్టాయిష్టాలను స్వీకరించలేని ఆధిపత్య భావజాలం ఇది.     

 - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం


 


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top