కోర్టుకెక్కనున్న ఫేస్బుక్

కోర్టుకెక్కనున్న ఫేస్బుక్ - Sakshi

జర్మన్ యూజర్ల వాట్సాప్ డేటాను ఫేస్బుక్ సేకరించడానికి, స్టోర్ చేయడానికి వీలులేదని ఆ దేశ ప్రైవసీ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కోర్టెక్కనుంది. జర్మన్ రెగ్యులేటరీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ, దీనిపై అప్పీల్కు వెళ్లనున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. దీంతో ప్రైవసీ రెగ్యులేటర్లకు, ఫేస్బుక్కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఫేస్బుక్ జర్మన్ వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడం వెంటనే ఆపేయాలని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని తొలగించాలని జర్మన్ ప్రైవసీ రెగ్యులేటరీ ఆదేశాలు జారీచేసింది.

 

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్బుక్ను షేర్ చేసుకుంటోంది. ఈ విషయంపై వాట్సాప్ కొత్త పాలసీ విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఒకవేళ తమ డేటా ఫేస్బుక్కు షేర్ చేయడం ఇష్టలేని వారు, వాట్సాప్ వాడకాన్ని నిలిపివేసుకోవచ్చంటూ అవకాశం కూడా కల్పించింది. 

 

డేటా సంరక్షణ చట్టాన్ని ఫేస్బుక్ అతిక్రమిస్తుందని డేటా ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హాంబర్గ్ కమిషనర్ మండిపడ్డారు. 35 మిలియన్ వాట్సాప్ యూజర్లున్న జర్మనీలో ఫేస్బుక్ దీనికోసం సరియైన అనుమతులు పొందలేదని పేర్కొన్నారు.  రెండేళ్ల క్రితం ఫేస్బుక్, వాట్సాప్ను సొంతంచేసుకున్నప్పుడు, రెండు కంపెనీల మధ్య ఎలాంటి డేటా మార్పిడి జరగదని వాగ్దానం చేసినట్టు కమిషన్ జోహాన్నెస్ కాస్పర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, వాట్సాప్ను 19 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.1,26,322 కోట్లకు) కొనుగోలు చేసింది. 

 

ప్రస్తుతం ఈ రెండు సంస్థలు చేస్తున్న పని, ఇటు ప్రజలను అటు యూజర్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా, డేటా సంరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నట్టు విమర్శించారు. కాగ జర్మన్ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై తాము అప్పీలుకు వెళ్తామని, హాంబర్గ్ డీపీఏతో తాము కలిసి పనిచేస్తామని, ఆయన సందేహాలను నివృతి చేస్తామని ఫేస్బుక్ ప్రకటించింది. జర్మనీలో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం హాంబర్గ్లో ఉంది. ఈ ప్రాంతమంతా కాస్పర్ పరిధిలో నడుస్తోంది.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top