ఇళ్ల కష్టాలు తీర్చేందుకు ఫేస్బుక్ గ్రూప్!

ఇళ్ల కష్టాలు తీర్చేందుకు ఫేస్బుక్ గ్రూప్! - Sakshi


న్యూఢిల్లీ: నీదే కులం, ఏ మతం, ఏ ప్రాంతం, మగా.. ఆడా, పెళ్లయిందా, కాలేదా, భర్త ఉన్నాడా, పోయాడా, పిల్లలున్నారా, లేదా, విజిటేరియనా, నాన్ వెజిటేరియనా.....? ఇలాంటి ప్రశ్నల పరంపరతో ఇళ్ల వేటలో అష్టకష్టాలు అనుభవించిన వారంతా ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఏకమయ్యారు. ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో ఇటీవల ముస్లిం మహిళ అయినందున అద్దె ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చిన మిస్బా ఖాద్రికి అండగా నిలిచారు. గురువారం నాటికి దాదాపు వెయ్యిమంది ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపుగా ఏర్పడి, ఇప్పటికే మైనారిటీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ముందు పోరాటం చేస్తున్న ఖాద్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. నగరం ఏదైనా ఇళ్ల అద్దె, కొనుగోళ్లలో యజమానులు, హౌసింగ్ సొసైటీలు చూపిస్తున్న వివక్షపై న్యాయ పోరాటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.



ఇలాంటి వివక్షపూరిత అనుభవాలను ఎదుర్కొన్న వారు దేశంలో కోకొల్లలే ఉన్నారు. వారిలో సామాన్యులు ఉన్నారు. ప్రముఖులూ ఉన్నారు. ముస్లిం అవడం వల్ల తమకు నచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కోలేక పోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ భార్య, సామాజిక కార్యకర్త, ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ రెండేళ్ల క్రితం వాపోయారు.



ఒకప్పుడు వివిధ కులాలు, మతాలు, జాతులతో భిన్నత్వంలో ఏకత్వంగా, దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ముంబై మహానగరం ఇప్పుడు కుల, మతాల ప్రాతిపదికన విడిపోతుంది. నగరంలోని గురుగావ్ ప్రాంతంలో మహారాష్ర్ట హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బెండి బజార్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మాజ్‌గావ్‌లో క్రైస్తవులు, మాతుంగ ప్రాంతంలో హిందూ తమిళులు, గుజరాతీ, మలయాళీలు ఎక్కువగా ఉన్నారు. మలబార్ ప్రాంతంలో జైనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకివ్వడం, కొనుగోలు చేయడానికి ఇతరులను అనుమతించడం లేదు. కుల, మత, ప్రాంతాలతో ప్రమేయం లేకుండా ఐక్యంగా ఉన్న నగర ప్రజల మధ్య విభజన రేఖ ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది ? ఎవరు చిచ్చు పెట్టారన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు.



అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992-93 మధ్య జరిగిన మత కల్లోలాలతో ప్రజల మధ్య విభజన, వివక్ష ప్రారంభమైంది. ఇళ్ల వేటలో ఏర్పడుతున్న వివక్షను ఎదుర్కోవడానికి అన్ని న్యాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ‘ఫేస్‌బుక్ గ్రూప్’ చెబుతోంది. అయితే ఇలాంటి వివక్షకు శాశ్వత పరిష్కారం సూచించే అవకాశం 2005లో వచ్చినా సుప్రీం కోర్టు వదిలేసుకొంది. మహారాష్ట్రకు చెందిన ఓ పార్సీ వ్యక్తి తన బంగళాను అమ్మకానికి పెట్టాడు. పార్సీలకు తప్ప ఇతరులకు అమ్మడానికి వీల్లేదని జోరాస్ట్రియన్ హౌసింగ్ సొసైటీ ఆంక్షలు విధించింది. దీనికి వ్యతిరేకంగా సదరు యజమాని సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఓ ప్రైవేటు సొసైటీ ఇలాంటి ఆంక్షలు విధించుకోవచ్చంటూ అతని కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top