అంతా దేవుడి దయ!

అంతా దేవుడి దయ! - Sakshi


న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు నేడు(బుధవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం సుప్రీంకోర్టు వార్తలు రాసే విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తదుపరి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా తననే నియమిస్తున్నారన్న వార్తపై స్పందించాల్సిందిగా కోరగా.. ‘అంతా దేవుడి ఆశీర్వాదం. నన్ను ఆ పదవిలో నియమిస్తే మంచిదే. నియమించకపోయినా మంచిదే. ఎన్‌హెచ్‌ఆర్‌సీ తదుపరి చైర్మన్‌గా ఎవరిని నియమిస్తున్నారన్న విషయంపై నాకెలాంటి సమాచారం లేదు’ అని వ్యాఖ్యానించారు.


 


దాదాపు 14 నెలల పాటు సీజేఐగా ఉన్న జస్టిస్ దత్తు.. అన్ని వివాదాస్పద ప్రశ్నలకు ‘నో కామెంట్స్’ అంటూ సమాధానమివ్వడం విశేషం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అసహనం అంశంపై ప్రశ్నించగా.. ‘ఆ అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు’ అన్నారు. ఎన్‌జేఏసీ చట్టం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ నిలిచిపోవడం, అక్రమాస్తుల కేసులో జయలలితకు బెయిల్ మంజూరు చేయడం తదితర అంశాలపైనా ఆయన నో కామెంట్స్ అనే జవాబిచ్చారు. కొలీజియం వ్యవస్థ కొనసాగాలని రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిందని, ప్రస్తుతం అది న్యాయశాఖ పరిగణనలో ఉందని పేర్కొన్నారు. తాను సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత పెండింగ్ కేసుల సంఖ్య 64 వేల నుంచి 58 వేలకు తగ్గిందన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top