కాన్సస్ షూటింగ్: అమెరికా డ్రీమ్స్పై భయాందోళనలు

కాన్సస్ షూటింగ్: అమెరికా డ్రీమ్స్పై భయాందోళనలు - Sakshi

న్యూఢిల్లీ : అమెరికాలో పీహెచ్డీ చేయడం అనుపమ్ సింగ్కు ఓ డ్రీమ్. ఒక్క అనుపమ్ సింగ్కే కాదు, అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివి మంచిగా సెటిల్ అవ్వాలని ప్రతిఒక్క భారతీయ యువత కలలు కంటుంటారు. కానీ బుధవారం అర్థరాత్రి జాతి విద్వేషంతో ఓ శ్వేత జాతి ఉన్మాది భారతీయులపై జరిపిన కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. అసలు అమెరికా వెళ్లి చదవడం అవసరమా? అనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అమెరికా స్టడీపై ఇప్పటికే ఓ ప్రణాళిక వేసుకున్న కొందరు విద్యార్థులు పునఃసమీక్షించడం ప్రారంభించారు. అయిష్టంగానే పిల్లల్ని విదేశాలకు పంపించే తల్లిదండ్రులైతే,  ఎక్కడికి వెళ్లక్కర్లేదు తమ కళ్లెదుటే క్షేమంగా  ఉంటే చాలని పట్టుబడుతున్నారు.

 

తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది ఓ బార్లో భారతీయులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్ చనిపోయారు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత ఆ దేశంలో దారుణంగా విద్వేషపూరిత భావజాలం భారీగా బలపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ పాలనలో అమెరికా భారతీయులకు సురక్షితం కాదని భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని తల్లిదండ్రులందరూ అమెరికాకు వారి పిల్లల్ని పంపించడం అంత మంచిది కాదని గాయపడిన అలోక్ తండ్రి విన్నపిస్తున్నారు.

 

గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు కూడా అమెరికాలో పోస్టు గ్రాడ్యుయేట్ చేసే ప్లాన్స్ను పునఃసమీక్షిస్తున్నామని, కెనడా కాని ఆస్ట్రేలియాకు కాని వెళ్లి చదువుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగితే భవిష్యత్తులో తమ పిల్లల డ్రీమ్స్ను తాము కాదనమని కొందరు పేరెంట్స్  ధైర్యంగా చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న వారి పరిస్థితేమిటి? ఈ కాల్పుల ఘటనతో అమెరికాలో విద్వేషపూరిత వాతావరణం, భయాందోళనలు పెరిగాయని అక్కడి విద్యార్థులు పేర్కొంటున్నారు.  ఇన్నిరోజులు వీసా నిబంధనల కఠినతరంతో భయాందోళనలు చెలరేగితే,  ఈ ఆందోళనలను మరికొంత పెంచుతూ జాతి విద్వేషపూరిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంపై ఏం పట్టన్నట్టు ట్రంప్ వ్యాఖ్యలు చేయడం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top