మా ఇంట్లో అమ్మాయిల జోలికి వస్తే ఊరుకోం

మా ఇంట్లో అమ్మాయిల జోలికి వస్తే ఊరుకోం - Sakshi


ఎన్ని చట్టాలు తెచ్చినా, చర్యలు చేపడుతున్నా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఆధునిక సమాజంలోనూ అతివలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. నవ నాగరిక లోకంలోనూ నారీమణులకు నగుబాటు తప్పడం లేదు. సామాజిక కట్టుబాట్లను తెంచుకుని విద్యాఉద్యోగ రంగాల్లో రాణిస్తున్న 'ఆమె'ను కీచక సంతతి కాల్చుకు తింటూనే ఉంది.  నాటి నుంచి నేటి వరకు సమాజం ఎంతగా పురోగమించినా మగాళ్ల మైండ్ సెట్ మారకపోవడం విస్తుగొల్పుతోంది.



'నేను మగాణ్ని, ఏమైనా చేస్తా' అనే ధోరణి ఇంకా కొనసాగుతుండడం శోచనీయం. ఇదే విషయం మరోసారి రుజువైంది. వనితలను వేధింపులకు గురిచేసే పోకిరీలకు ముకుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 'షీ' బృందాలు ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పరిధిలో ఆడవాళ్లను అల్లరి పెడుతూ 250 మందిపైగా జులాయిలు ఈ బృందానికి చిక్కారు.  చేసిన తప్పుకు పశ్చాత్తాపం ప్రకటించకపోగా వేధింపులు తప్పనిపించలేదంటూ ఈ 'ఇడియట్స్' లో 80 శాతం మంది దబాయించడం మగాడి మైండ్ సెట్ మారలేదనడానికి ప్రబల తార్కాణం.



అబ్బాయిలతో అమ్మాయిలు చనువుగా మెలగడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని సూత్రీకరించిన ఈవ్ టీచర్లు... తమ ఇంట్లో అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే తోలు ఒలుస్తామని హుంకరించడం హాస్యాస్పదంగా కనబడుతోంది.  కొంచెం అటుఇటుగా దేశమంతా ఇదే పరిస్థితి ఉందని చెప్పడానికి సంకోచించాల్సిన పనిలేదు. సాంకేతికంగా శిఖరస్థాయి చేరామని చంకలు గుద్దుకుంటున్న సమాజంలో స్త్రీలపై వేధింపులు లెక్కకు మిక్కిలిగా పెరుగుతుండడం చూస్తుంటే పితృస్వామ్య పెత్తందారీ పోకడలు పూర్తిగా పోలేదని అర్థమవుతోంది. తమ ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు మగాళ్లు అబలలపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం కూడా పరిస్థితి చేయిదాటడానికి కారణమన్న వాస్తవం విస్మరించరానిది.



సమాజం పురోగమిస్తున్న కొద్దీ అనాగరిక పోకడలు పతనం కావాలి. అదేం విచిత్రమో ఆడవాళ్లపై అకృత్యాలు నానాటికీ అధికమవుతున్నాయి. కారణాలు ఏమైనా కానీ కాంతలపై కిరాతకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక పటాటోపంతో మిడిసిపడుతున్న నేటి సమాజం.. స్త్రీల పట్ల పురుషుడి ఆలోచనా ధోరణిలో మాత్రం గతకాలంలోనే ఆగిపోయిందన్న భావన కలుగుతోంది.  నిజంగా సమాజం మారివుంటే ఫుణ్య ధరిత్రిలో పడతులపై అకృత్యాలు ఎందుకు పెరుగుతాయి. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే మగాడి ఆలోచనా విధానం మారనంత కాలం అతివలకు కష్టాలు తప్పవు.



-పి. నాగశ్రీనివాసరావు

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top