20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం: ఫ్లిప్‌కార్ట్

20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం: ఫ్లిప్‌కార్ట్ - Sakshi


న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాల సేవల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. వీటిలో లాజిస్టిక్స్, వేర్‌హౌస్ విభాగాలలో దాదాపు 60 శాతం ఉద్యోగాలు రానున్నాయని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేసింది. తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయదారులే రవాణా విభాగంలో డ్రైవింగ్ తదితర ఉద్యోగాలను కల్పిస్తారని పేర్కొంది. ఈ-కామర్స్ రంగంలోని ప్యాకేజింగ్, క్యాటలాగింగ్ తదితర విభాగాల్లో గతేడాది 75,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అంకిత్ నాగోరి తెలిపారు.



దేశంలో ఈ-కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతుండటంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది టైర్-2, టైర్-3 పట్టణాలలో ఉద్యోగ కల్పన 50-60 శాతం ఉంటుందని తెలిపారు. జైపూర్, బరోడా వంటి పట్టణాల్లో ఇప్పటికే క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాలు వృద్ధి చెందాయని, ఇవి భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలకు కేంద్రాలుగా మారతాయన్నారు. విక్రయదారులు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. గృహోపకరణ ఉత్పత్తులు, దుస్తులు, మొబైల్ ఉపకరణాలు తదితర విక్రయదారులే ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టిస్తారని చెప్పారు. కార్మిక శాఖ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 20 పట్టణాల్లో ఔత్సాహికులకు ఎస్‌ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిని మరో ఆరు నెలల్లో 40 పట్టణాలకు విస్తరిస్తామని చెప్పారు.    

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top