ఎడ్యుకేషన్ & జాబ్స్


మరో 283 కొలువులకు నోటిఫికేషన్

* మూడు విభాగాల్లో నియామకాల కోసం విడుదల


సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరిన్ని కొలువులకు పచ్చజెండా ఊపింది. మూడు విభాగాలలో కలిపి 283 ఉద్యోగాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ), హైదరాబాద్ జల మండలి, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులో ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్లు, మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో నియామకాల కోసం ఈ నోటిఫికేషన్ వెలువరించింది. దరఖాస్తు విధానం మొత్తం ఆన్‌లైన్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

    

పోటీ పరీక్షలకు 24 నుంచి ఉచిత శిక్షణ

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 24 నుంచి గ్రూప్-1, 2 తదితర పోటీ పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంగళవారం సెల్ డెరైక్టర్ విష్ణుదేవ్ తెలిపారు. ఓయూలో చదివే విద్యార్థులు ఇందుకు అర్హులని, ఆసక్తి ఉన్నవారు ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

నేడు, రేపు ఓయూసెట్ స్లైడింగ్

హైదరాబాద్: ఓయూసెట్-2015 ప్రవేశాలకు ఈ నెల 23, 24న స్లైడింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెస్సీ కోర్సులు, గురువారం ఎంఏ, సోషల్ సైన్స్ కోర్సులకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు అలాట్ అయినట్లు ఎస్‌ఎంఎస్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే స్లైడింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

 

అధిక ఫీజులు తీసుకుంటే చర్యలు

* ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రసాద్ హెచ్చరిక

హైదరాబాద్: రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరిన అభ్యర్థుల నుంచి నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రసాద్ హెచ్చరించారు. అసోసియేషన్ ఆఫ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయాలని కోరారు.

 

డిసెంబర్‌లో రెండో విడత ‘విద్యానిధి’

సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యకు అర్హులైన ఎస్సీ విద్యార్థులను రెండో విడతలో భాగంగా డిసెంబర్‌లో ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్, గ్రూప్ -1, 2 వంటి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు, గతేడాది 2.7 లక్షల కుటుంబాలకు రూ.174.25 కోట్ల మేర లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top