రేప్ కేసుపై మహిళా జడ్జి సంచలన ఆదేశాలు

రేప్ కేసుపై మహిళా జడ్జి సంచలన ఆదేశాలు - Sakshi

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినా.. ప్రతి సందర్భంలోనూ దాన్ని అత్యాచారం అనలేమని బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 21 ఏళ్ల యువకుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా ఆమె ఇలా అన్నారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో అతడు విడిపోయిన తర్వాత ఆమె అతడిపై రేప్ కేసు పెట్టగా, చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునే ముందు తమ నిర్ణయానికి తామే బాధ్యత తీసుకోవాలని జస్టిస్ మృదులా భత్కర్ చెప్పారు. ఒకవేళ మోసం చేసి అంగీకారం పొందితే మాత్రం అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు. ఆమెను బలవంతంగా శృంగారానికి ఒప్పించారని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు ఉండాలని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం అనే విషయం మాత్రం ఇలాంటి కేసుల్లో నిలబడదని జస్టిస్ మృదులా భత్కర్ స్పష్టం చేశారు. 

 

సమాజం శరవేగంగా మారుతున్నా, ఇప్పటికీ నైతిక విలువలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె చెప్పారు. పెళ్లి సమయానికి కన్యగానే ఉండాల్సిన బాధ్యత మహిళపై ఉందన్న నైతిక సూత్రం తరతరాలుగా మన దేశంలో ఉందని, అయితే ప్రస్తుత యువతరం మాత్రం పలువురితో మాట్లాడుతూ లైంగిక కార్యకలాపాల గురించి బాగా తెలుసుకుంటున్నారని అన్నారు. సమాజం స్వేచ్ఛాయుతం కావడానికి ప్రయత్నిస్తోంది గానీ నైతిక విలువల విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో శృంగారంలో పాల్గొనాలా వద్దా అనేది ఇద్దరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, అలాంటప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించాలన్న విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారని జస్టిస్ భత్కర్ అన్నారు. అమ్మాయిలు పెద్దవాళ్లయి, చదువు కూడా ఉన్నప్పుపడు పెళ్లికి ముందు సంబంధాల వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా ఆలోచించాలని చెప్పారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top