మార్స్ ఉపరితలం కింద సముద్రం!

మార్స్ ఉపరితలం కింద సముద్రం! - Sakshi


వాషింగ్టన్: భూమికి దగ్గరగా మానవ నివాసానికి యోగ్యమయ్యే అవకాశమున్న గ్రహంగా అంగారకుడు ఉన్నా.. అక్కడ నీళ్లు లేకపోవడమే ఇప్పటివరకు పెద్ద సమస్య. కానీ ఆ గ్రహ ఉపరితలం కింద భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన జాడలు కనిపిస్తున్నా... గ్రహం ఉపరితలంపై ఎక్కడా నీరు కనిపించలేదు. మరి ఆ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్లినట్లు అనే సందేహాలు శాస్త్రవేత్తలను చాలా రోజులుగా పట్టి పీడిస్తున్నాయి.



అయితే తాజాగా నాసా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం.. భూమిపై పడిన పలు అంగారక ఉల్కాశకలాలను పరిశీలించి, ఆ గ్రహంపై నీరు ఉందనేందుకు ఆధారాలను వాటిలో గుర్తించింది. ఈ నీరంతా అంగారకుడి ఉపరితలం కింద ద్రవ రూపంలోనో, మంచు రూపంలోనో ఉండవచ్చని భావిస్తోంది. ఇది అంగారకుడి వాతావరణంలో మార్పులు, అక్కడ జీవం ఉండే అవకాశం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన జపాన్ టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త తొమహిరొ ఉసయ్ తెలిపారు.



శకలాల్లో తాము గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ ఐసోటోప్ అణువులు.. మార్స్ ఉపరితలంపై, వాతావరణంలో గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ అణువులకన్నా భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నీటి పరిమాణాన్ని బట్టి అందులోని హైడ్రోజన్ ఐసోటోప్‌లుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాము ఉల్కా శకలాల్లో గుర్తించిన ఐసోటోపిక్ సిగ్నేచర్ ప్రకారం అంగారకుడి ఉపరితలం కింద భారీ స్థాయిలో నీళ్లు మంచు రూపంలో ఉండే అవకాశముందని తొమహిరొ వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top