ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వాయిదా

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వాయిదా


- ఆయుష్‌ కోర్సులపై స్పష్టత లేమి

- ప్రవేశ పరీక్షలకు సర్వీసు ప్రొవైడర్‌ సమస్య

- రెండుమూడ్రోజుల్లో స్పష్టత వస్తుందంటున్న సెట్‌ కమిటీ



సాక్షి, హైదరాబాద్‌:
ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీకి మరింత సమయం పట్టనుంది. ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ మెడికల్‌ పరీక్షను నిర్వహించాలా? లేదా నీట్‌ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలా? అన్న విషయంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎంసెట్‌ దరఖాస్తులు, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపు, ఫలితాల వెల్లడికి సంబంధించిన ఆన్‌లైన్, కంప్యూటర్‌ ప్రాసెస్‌ను చేయాల్సిన సర్వీసు ప్రొవైడర్‌ ఎంపిక అంశం తేలలేదు. దీంతో సోమవారం విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన నోటిఫికేషన్‌ జారీని ఎంసెట్‌ కమిటీ వాయిదా వేసింది. నోటిఫికేషన్‌పై రెండుమూడ్రోజుల్లో స్పష్టత వస్తుందని వెల్లడించింది.



2వ తేదీ మధ్యాహ్నం వరకు వీటిపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. లేదంటే దరఖాస్తుల స్వీకరణ కూడా మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. 3వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని కమిటీ చెబుతోంది. ఆయుష్‌ కోర్సుల ప్రవేశాలపై స్పష్టత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నత విద్యా మండలి ఇటీవల లేఖ రాసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ నుంచి సోమవారం వరకు కూడా స్పష్టత రాలేదు.



సర్వీసు ప్రొవైడర్ల ఫిర్యాదు

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ నుంచి దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్లు, ఫలితాల వెల్లడికి సంబంధించిన ప్రాసెస్‌ను చేసే సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక చిక్కుల్లో పడింది. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో సెట్స్‌ కన్వీనర్ల కమిటీ ఇటీవల సర్వీసు ప్రొవైడర్‌ ఎంపికకు చర్యలు చేపట్టింది. అయితే కొంత మంది తెలంగాణకు చెందిన సర్వీసు ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఓపెన్‌ టెండర్లు పిలువకుండా, కన్వీనర్లకు తెలిసిన వారినే పిలిచి సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అన్ని ప్రవేశ పరీక్షల పనులను ఒకే సంస్థకు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని వివరణ కోరింది. అయితే ఇదీ పరీక్షలకు సంబంధించిన అంశం అయినందున పాత పద్ధతిలోనే గుర్తించిన 8 సర్వీసు ప్రొవైడ్‌ చేసే సంస్థలను పిలిచి, తక్కువ ధర కోట్‌ చేసిన వారికి పనులను అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కొత్త వారికి అవకాశం ఇస్తే పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, బహిరంగ టెండర్‌కు వెళ్తే సమయం సరిపోదని పేర్కొంది. ఈ విషయంలో ఏం చేయాలో ప్రభుత్వమే తేల్చాలని ఉన్నత విద్యా మండలి లేఖ రాసింది. అప్పటిదాకా సర్వీసు ప్రొవైడర్‌ ఎంపికను వాయిదా వేస్తామని పేర్కొంది. దీనిపైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత రాలేదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top