కలలు కనడం నేర్పిన గురుబ్రహ్మ

భువనేశ్వర్‌లో కళింగ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్ విద్యార్థినులతో.. - Sakshi


అది 2002. చెన్నైలో అన్నా యూనివర్సిటీలో కలాం తనకెంతో ఇష్టమైన పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రధాని వాజ్‌పేయి నుంచి ఫోన్. క్లాస్‌రూములో ఉన్నందువల్ల ఫోన్‌ను రిసీవ్ చేసుకోలేకపోయారు. బయటికొచ్చాక ప్రధానికి కాల్ చేశారు. వాజ్‌పేయి... ‘రాష్ట్రపతి పదవి చేపడతారా?’. గంట సమయం అడిగారు కలాం. ఈలోగా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులతో మాట్లాడారు. 60 శాతం మంది బాగుంటుందని చెబితే, 40 శాతం వద్దన్నారు. మెజారిటీ వైపే మొగ్గారు కలాం. ఎందుకో తెలుసా... రాష్ట్రపతి అయితే దేశం గురించి, విద్య గురించి, యువత గురించి తన ఆలోచనలను పంచుకోవడానికి ఓ పెద్ద వేదిక దొరుకుతుందనేది ఆయన భావన.

 

మనం మన తల్లిదండ్రుల తర్వాత అంత విలువనిచ్చే గురువు ఎలా ఉండాలో నేర్పిన ‘గురుబ్రహ్మ’ అబ్దుల్ కలాం. పిల్లలంటే ఎంతో ఇష్టపడే ఆయనకు.. వారికి పాఠాలు నేర్పడమూ అంతే ఇష్టం. విద్యార్థులకు ‘చదువు చెప్పడం’ కాదు.. ‘చదువు నేర్పాల’న్న అధ్యాపకుడు ఆయన.  విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని పాదుకొల్పాలని, అదే జ్ఞానానికి మార్గమని కలాం తరచూ చెప్పేవారు. స్వతంత్ర భారతావనిలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ల తరువాత బాలలు, విద్యార్థి లోకంతో అంతటి అనుబంధం ఉన్నది అబ్దుల్ కలాంకే. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా... పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇలా విద్యా సంస్థలను సందర్శించి, అక్కడి పిల్లలతో గడిపేందుకు, వారితో ఎక్కువసేపు మాట్లాడేందుకే ప్రాధాన్యమిచ్చేవారు.

 

సృజనాత్మకతను మేలుకొల్పాలి..

తన కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అబ్దుల్ కలాం.. ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత 2001లో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ, సొసైటల్ ట్రాన్స్‌ఫర్మేషన్  ప్రొఫెసర్‌గా చేరారు. 2002 నుంచి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన... ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌కాగానే తిరిగి బోధనా వృత్తినే చేపట్టారు. విద్యార్థిలోకాన్ని, యువతను తన ప్రసంగాలు, రచనల ద్వారా అబ్దుల్ కలాం వెన్నుతట్టి లేపారు.



ప్రాథమిక స్థాయిలోనే టీచర్లు పిల్లల్లో సృ జనాత్మకతను తీసుకురావడానికి మంచి సమయమని చెప్పేవారు. దేశంలో యూనివర్సిటీ విద్యను సమూలంగా సంస్కరించాలని అబ్దుల్ కలాం సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా నిలవాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని గట్టిగా చెప్పిన కలాం... దేశంలోని పిల్లలందరికే కాదు టీచర్లకూ మార్గదర్శకుడిగా నిలిచారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top