ధోనీ, యువీపై ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!

వేటుకు సమయం వచ్చేసింది!!


న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా స్థిరమైన ఆటతీరు కనబరుచలేకపోతున్న సీనియర్‌ ఆటగాళ్లు ఎంఎస్‌ ధోనీ, యువరాజ్‌సింగ్‌ భవితవ్యంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. 2019 వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా ఈ ఇద్దరి భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. ధోనీని, యువీని జట్టులో కొనసాగించే విషయమై సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని స్పష్టం చేశాడు.



చాంపియన్స్‌ ట్రోఫీలో నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన యువీ, ధోనీ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయారు. ఫైనల్‌ లో ఓటమి నేపథ్యంలో ఈ ఇద్దరిపై వేటు వేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో యువీని, ధోనీని ఇంకా జట్టులో కొనసాగించాలా? అన్న ప్రశ్నకు ద్రవిడ్‌ స్పందించారు.  ‘ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో’తో ఆయన మాట్లాడుతూ.. ‘సెలెక్టర్ల దృష్టిలో భారత్‌ క్రికెట్‌కు రోడ్‌మ్యాప్‌ ఏమిటి? రానున్న కొనేళ్లలో ఈ ఇద్దరు క్రికెటర్లు జట్టులో ఏ పాత్ర పోషించబోతున్నారు? ఆ ఇద్దరికి జట్టులో స్థానం ఉందా? లేదా ఒక్కరికైనా అశకాశం ఇస్తారా?.. ఈ విషయాన్ని సమీక్షించడానికి ఎంత సమయం తీసుకుంటారా? ఏడాదా? ఆరు నెలలా? ఎంతోమంది ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు. వారిని పట్టించుకోదలిచారా? ఈ ఇద్దరు క్రికెటర్ల సంగతి పక్కనబెట్టి.. వారికి అవకాశాలు ఇవ్వదలిచారా?’ అంటూ ద్రవిడ్‌ నిర్మోహమాటంగా చెప్పాడు.



శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటించినప్పటికీ.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇకనైనా ప్రయోగాలు చేయాలని ఆయన టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఇప్పుడు అవకాశాలు ఇవ్వకుండా.. ఏడాదో, ఆరు నెలల తర్వాతో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చింతిస్తే ప్రయోజనముండబోదని ద్రవిడ్‌ అన్నాడు. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడ్డేజా భవితవ్యంపైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశాడు.


చదవండి: అనిల్‌ కుంబ్లే సంచలన నిర్ణయం!

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top