అగ్రరాజ్యంగా బాధ్యతలు చేపడతాం: చైనా

అగ్రరాజ్యంగా బాధ్యతలు చేపడతాం: చైనా

బీజింగ్: అగ్రరాజ్యంగా ఉన్న ప్రస్తుత దేశం ఆ స్ధానంలో నిల్చోలేకపోతే తాము ఆ స్ధానాన్ని భర్తీ చేస్తామని చైనా రాయబారి ఒకరు అన్నారు. చైనా ప్రపంచదేశాల్లో ఒకటిగా ఉండాలనుకుంటోందే తప్ప  నాయకత్వం వహించాలనే యోచన లేదని చెప్పారు. తప్పనిసరి పరిస్ధితిలో మాత్రం ఆ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు.

 

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం 'అమెరికా ఫస్ట్‌' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అంతర్జాతీయ ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఝాంజ్‌ జున్‌ పై వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ స్విట్జర్లాండ్‌ పర్యటనపై విదేశీ జర్నలిస్టులతో ముచ్చటించిన ఆయన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌)లో ప్రవేశపెట్టిన బిల్లుపై మాట్లాడారు. అంతర్జాతీయ సంబంధాల్లో చైనాను ప్రపంచ లీడర్‌గా జిన్‌ పింగ్‌ సదస్సులో పేర్కొన్నట్లు వెల్లడించారు.

 

అమెరికాతో పాటు పలు దేశాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు బలం చేకూర్చుతున్నాయని చెప్పుకొచ్చిన ఆయన వారు ఆ బాధ్యతలను నిర్వర్తించలేని సమయంలో చైనా అందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అమెరికా తర్వాత చైనా ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్ధిక వ్యవస్ధ అన్న విషయం తెలిసిందే. అమెరికన్‌ల ఉద్యోగాలు పోవడానికి చైనానే కారణమంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఝాంజ్‌ మండిపడ్డారు. వ్యాపార యుద్ధాల్లో ట్రంప్‌ మునిగిపోతే ఆర్ధిక ప్రగతిని సాధించలేరని అన్నారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top