ఆమెకు ఏడాదిపాటు ప్రపోజ్‌ చేశాడు!

ఆమెకు ఏడాదిపాటు ప్రపోజ్‌ చేశాడు! - Sakshi


రెండేళ్ల కిందట ఆమె అతనికి ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో పరిచయమైంది. ఇద్దరి మధ్య మాటామాట కలిసి మనస్సులు ముడిపడ్డాయి. ఆమెను జీవితభాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లిచేసుకుంటావా' అని అడగాలనుకున్నాడు. కానీ, ఆషామాషిగా ప్రపోజ్‌ చేస్తే అందులో కొత్తేముంటుంది. అందుకే అతను చాలా తీవ్రంగా ఆలోచించి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.





'నువ్వే నా జీవిత సర్వస్వం... నన్ను పెళ్లిచేసుకుంటావా.. నా భార్యగా ఉంటావా' అని ఏడాదిపాటు విభిన్నంగా ప్రపోజ్‌ చేస్తూ.. ఓ వీడియో రూపొందించాడు. ప్రతిరోజూ ఆమె పట్ల తనకు కలిగే భావనను ఓ కార్డు మీద రాసి.. నన్ను పెళ్లిచేసుకుంటావా? అని కోరుతూ.. దానిని వీడియోలో చిత్రీకరించాడు. 364 రోజులపాటు ఇలా ఆమె పట్ల తనలోని ప్రేమభావాలను వ్యక్తం చేస్తూ.. రూపొందించిన ఈ వీడియోను..  ఎట్టకేలకు ఆమె చేతిలో పెట్టాడు. అతని మనస్సులోని మాటను వీడియోరూపంలో చూసి ముగ్ధురాలు అయిన ఆమె.. అతన్ని పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకొంది.



ఇలా వినూత్నమైన రీతిలో ప్రపోజ్ చేసి తన ప్రేమను గెలుచుకున్నాడు షికాగోకు చెందిన జోష్‌ షిమిట్జ్‌. డానియెల్‌ రోయెష్‌తో ప్రేమలో పడిన అతను.. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ప్రతిరోజూ ఆమెపై కలిగే తన ప్రేమభావనను కార్డుపై వ్యక్తంచేసి.. దానిని చిత్రీకరించాడు. లక్కీగా అతడి ఏడాది ప్రేమతపనను గుర్తించిన రోయెష్‌.. పెళ్లికి సై అంది. ఈ జంట వినూత్న ప్రేమకథ తాజాగా ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 364 రోజులూ అతను విభిన్నంగా ప్రపోజ్‌ చేస్తూ.. రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆకట్టుకుంటోంది.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top