అభివృద్ధికి ప్రజలే విధాన కర్తలు

అభివృద్ధికి ప్రజలే విధాన కర్తలు - Sakshi


ఆ లక్ష్యంతోనే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం: కే టీఆర్

విధి విధానాలపై చర్చించేందుకు మంత్రివర్గ  ఉపసంఘం భేటీ

గ్రామాభివృద్ధి నిధులు ఇక పంచాయతీల ఖాతాలకే..

స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాకే తుది విధానాలు


 

 హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, లకా్ష్మరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపసంఘం భేటీ అనంతరం కేటీఆర్  విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి విధానాలు ప్రజల నుంచే రూపుదిద్దుకోవాలన్న ల క్ష్యంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామజ్యోతి విధి విధానాల రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వివిధ సంక్షేమ విభాగాల అధికారులను కోరినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చిన సూచనలను తుది నివేదికలో పొందుపరుస్తామని చెప్పారు. తుది నివేదికను ఆగస్టు మొదటి వారంలో సీఎంకు సమర్పిస్తామని వివరించారు.



భేటీలో చర్చకు వచ్చిన అంశాలివీ..

►గ్రామజ్యోతిలో ప్రధానంగా ఏడు అంశాలపై దృష్టి సారించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయానికి వచ్చింది. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సహజ వనరులు, నీరు, పారిశుధ్యం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

►వివిధ శాఖల ద్వారా గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్న నిధులను గ్రామ పంచాయతీల నుంచే ఖర్చు చేస్తే మేలని ఉప సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయా శాఖల నుంచి నిధులను సమీకరించి గ్రామ పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించారు.

► మండల స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులందరూ వారానికి ఒకమారు కనీసం ఒక గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని నిర్ణయించారు.

► వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు, క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోనూ చర్చించాకే విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. బుధవారం జెడ్పీ చైర్మన్లతో, ఆగస్టు 2న మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ సర్పంచులతో సమావేశం కావాలని నిర్ణయించారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top