మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి

మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి


జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది. తాజాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఈ ఉప ఎన్నికలలో తాను ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ అధికారి ప్రవీణ్ నాయర్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దానికి ముందుగా చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.



జయలలిత మరణం తర్వాత ముందుగా వచ్చింది ఆర్కేనగర్ వాసులేనని, ఇప్పుడు అమ్మకు అసలైన వారసులు ఎవరన్న విషయాన్ని వాళ్లే ఈ ప్రపంచానికి చాటి చెబుతారని ఉద్వేగంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అన్నాడీఎంకేకు మంచి నాయకత్వం అవసరమని, కేవలం తాను మాత్రమే జయలలిత చూపించిన మార్గంలో పార్టీని నడిపించగలనని కార్యకర్తలు భావిస్తున్నారని దీప అన్నారు. ఎన్నికల కమిషన్ తమకు ఏ గుర్తు కేటాయిస్తే దానిమీదే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రచారం ప్రారంభించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top