సాయమో.. చంద్రశేఖరా..!

సాయమో.. చంద్రశేఖరా..! - Sakshi


తెలంగాణ సంబురాలకు రూ.1.20 కోట్లు..

గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు..

బతుకమ్మ పండుగకు రూ.10 లక్షలు..

రంజాన్ వేడుకలకు రూ.13 లక్షలు..

తీజ్ పండుగకు రూ.లక్ష..




ఆయా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులివీ. కానీ కాలంలేక.. పంటలు వేయక.. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సర్కారు చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. పై లెక్కలను చూస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో ఇట్టే తెలిసిపోతుంది. పండుగలకు, పబ్బాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం నలుగురికి అన్నం పెట్టే రైతన్న కాలం కలిసిరాక అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నా నయాపైసా సాయం చేయకపోవడం బాధాకరమైన విషయం.

 

 కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు  బలవన్మరణాల సంఖ్య150కిపైనే.. అధికారిక లెక్కల ప్రకారం 64 మందే  ఒక్క కుటుంబానికీ అందని సాయం మరోవైపు పుష్కరాలకు, పండుగలకు, పబ్బాలకు కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు రైతులకు కౌన్సెలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పిస్తామన్న కలెక్టర్ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు...      

 

పలకరించినోళ్లు లేరు

 సిరిసిల్ల మండలం చిన్నబోనాలకు చెందిన అంబటి నారాయణ(45) అనే రైతు తనకున్న  ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేస్తూ భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. వరుసగా పంటలు దెబ్బతినడంతో ఉన్న కాస్త భూమి అప్పులకే హరించుకుపోయింది. ఈ ఏడాది కొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి వేసినా కాలం కలిసిరాలేదు. వర్షాలు లేక పంట ఎండిపోయింది. రూ.4లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతితో భార్య దేవవ్వ, కూతురు వందనను దిక్కులేని వారయ్యారు. నాలుగు రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం తమను పలకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మునుపెన్నడూ లేనంతగా జిల్లాలో రైతన్నలు పిట్టల్లా రాలుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అన్నదాతల ఆత్మహత్యలు ఆగకపోవడం, ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం మరింత కలిచివేస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతన్నల సంఖ్య 150 దాటింది. జిల్లా త్రిసభ్య కమిటీ రికార్డుల ప్రకారమైతే ఈ సంఖ్య 64 మాత్రమే. అయినప్పటికీ వీరిలో ఏ ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సా యం అందించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 409 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 141 కుటుంబాలకు ఆర్థికసాయం అందించామని వ్య వసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వ యంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వ సాయం అందుకున్న వారిలో జిల్లాకు చెందిన వారెవరూ లేకపోవడం బాధాకరం. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన దాఖలాలూ లేవు.  

 

 కోలుకోలేని దెబ్బ

రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, కరెంటు కోతలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నల్లో ఈసారి ఖరీఫ్ సీజన్‌లో కురిసిన తొలకరి వానలు ఆశలు రేకెత్తించాయి. ఇకపై కరెంటు కోతలుండబోవని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా రైతాంగం పెట్టుబడుల కోసం అప్పులు చేసి నారు పోశారు. అయితే తొలకరిలో పలకరించిన వరుణుడు ఆ తరువాత ముఖం చాటేయడంతో నారుమళ్ల దశలోనే ఎండిపోయే పరిస్థితి ఏర్పడడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 12,87,230 ఎకరాలు. వానల్లేకపోవడంతో ఈ ఏడాది 9,73,135 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన 3.14 ల క్షల ఎకరాలు సాగుకే నోచుకోలేదు. సాగు చేసిన వాటిలోనూ వానల్లేకపోవడంతో దాదాపు 4లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మిగిలిన 5.7 లక్షల ఎకరాల్లోనే వరి, మొక్కజొన్న, పత్తిసహా వివిధ రకాల పంటలు సాగవుతున్నాయన్నమాట. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన వ్యవసాయశాఖ ముందస్తు రబీకి వెళ్లాలని చెప్పడం తప్ప ప్రత్యామ్నాయ చర్యలేమీ తీసుకోలేని దుస్థితి కనపడుతోంది.

 

 421 జీవోపై పట్టింపేది?

 ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 421 జీవోను విడుదల చేశారు. ఈ జీవోను అమలు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతోంది. జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.లక్షన్నర చొప్పున పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికీ అందకపోవడం గమనార్హం. ఆర్డీవో, మండల వ్యవసాయాధికారి, డీఎస్పీలు సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ ఆత్మహత్యలను నిర్ధారించి ఆర్థికసాయం అందజేయాల్సి ఉంది. కానీ ఆ కమిటీ సకాలంలో నివేదిక అందించడంలోనూ విఫలమవుతోంది. రైతు ఆత్మహత్య చేసుకున్న తరువాత ఎప్పటిలోగా నివేదిక అందించాలనే విషయంపై జీవోలో స్పష్టత లేకపోవడంతో త్రిసభ్య కమిటీ సైతం నివేదిక పంపడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ జీవోను సవరించడంతోపాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలు కోరుతున్నా పాలకులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు.

 

 రైతులకు కౌన్సెలింగ్ చేయండి : కలెక్టర్

 అప్పులబాధలో ఉన్న రైతులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంట నష్టపోయి అప్పులబాధలో ఉన్న రైతులను గుర్తించాలని సూచించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రైతుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, పశుసంవ ర్ధక శాఖ అధికారులతో రైతుల ఆత్మహత్యల నివారణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోయారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, ధైర్యంగా ఉండాలని అన్నదాతలను కోరారు. రబీలో పంటల సాగుకు పంట రుణాలు మంజూరు చేస్తామని, సబ్సిడీ విత్తనాలు అందజేస్తామని తెలిపారు.

 

 ఉపాధిహామీ పథకం ద్వారా చేతినిండా పనులు కల్పిస్తామన్నారు. ఎకరంకంటే తక్కువున్న రైతులను జేఎల్‌సీ గ్రూపులుగా ఏర్పాటు చేసి పంట రుణాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొలాల్లో ఇష్టానుసారం బోర్లు వేసి అప్పుల పాలు కావొద్దని కోరారు. ఈనెల 7 నుంచి 14 వరకు వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, బ్యాంకు అధికారులతో గ్రామాల్లో రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ఐదు డివిజన్లలో రైతు సదస్సులు నిర్వహించి ఉత్తమ రైతుల ద్వారా ఆధునిక పద్ధతులు, పాడిపశువుల పెంపకంపై రైతులను చైతన్యపర్చాలని సూచించారు.

 

 18004254731 రైతుల కోసం హెల్ప్‌లైన్

 జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తగిన పరిష్కారం చూపేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు పాడి పశువులు మంజూరు చేస్తామని చెప్పారు. రైతులు తమ పంట రుణాలను కచ్చితంగా రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయం ఒక్కదానిపైనే ఆధారపడకుండా ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదన పు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సంయుక్త సంచాలకులు ఛత్రునాయక్, రాంచందర్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ చౌదరి, నాబార్డ్ ఏజీఎం తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top